Asaduddin Owaisi Interesting Comments On AP Politics
ప్రస్తుతం దేశంలో హిజాబ్ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం కాస్త సుప్రీం కోర్టుకు చేరడంతో… అక్కడ కూడా న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఒకరు హిజాబ్ ధరించడాన్ని సమర్థించగా.. మరొకరు వ్యతిరేకించారు.
ఇద్దరు జడ్జీలు వేర్వేరు తీర్పులు ఇవ్వడంపట్ల మండిపడిన ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ … హిజాబ్ ధరించిన ముస్లిం యువతి భవిష్యత్తులో ఏదో ఒక రోజున ఈ దేశ ప్రధాని కావాలన్నదే తన కల అన్నారు. హిజాబ్ ని ముస్లింల వెనుకబాటుతనంగా కేంద్రం పరిగణిస్తున్నట్టు కనిపిస్తోందన్నారు.
ఈ దేశాభివృద్ధికి ముస్లిం మహిళలు కూడా తమ వంతు సేవలు అందిస్తున్నారని ఆయన చెప్పారు. మా కూతుళ్లను హిజాబ్ ధరించనివ్వండి.. మీరు బికినీలు ధరించండి అని ఆయన కేంద్రాన్ని ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మీరు హైదరాబాద్ వస్తే డ్రైవింగ్ లో ఎంతో నైపుణ్యం కలిగిన ముస్లిం బాలికలు కనిపిస్తారు అన్నారాయన,
కర్ణాటక ప్రభుత్వం హిజాబ్ నిషేధంపై ఎందుకు పట్టు పడుతోందో అర్థం కావడం లేదన్నారు. హిందూ, క్రైస్తవ, సిక్కు విద్యార్థులు తమ మతపరమైన డ్రెస్సులతో తరగతులకు వస్తే వారిని ఏమీ అనరని..కానీ ఓ ముస్లిం విద్యార్ధిని మాత్రం ఆపివేస్తారని ఒవైసీ ఆరోపించారు. ఇప్పటికైనా హిజాబ్ వివాదంపై అత్యున్నత న్యాయస్థానం సరైన తీర్పునిచ్చి ముస్లిం మహిళలకు న్యాయం చేయవచ్చునని తాను ఆశిస్తున్నానని ఒవైసీ పేర్కొన్నారు.
అసలు వివాదం ఏమిటంటే… కర్ణాటకలో కొందరు ముస్లిం బాలికలు హిజాబ్ ధరించి కాలేజీకి వచ్చారు. కానీ హిజాబ్ ధరించిన కారణంగా వారికి తరగతులకు అనుమతి ఇవ్వలేదు. దీనితో వారు ఆందోళనకు దిగారు. కాలేజీల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ ఫిబ్రవరి 5న కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో హిజాబ్ వివాదం మరింత ముదిరింది. హిజాబ్ వివాదం మరిన్ని ప్రాంతాలకు వ్యాపించడంతో నిరసనలు హోరెత్తాయి. ఇక దీనిపై కొందరు విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు.
హిజాబ్ ధరించడం తమ రాజ్యాంగ హక్కని వారు పిటిషన్ దాఖలు చేశారు. దీనితో విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు మార్చి 15న సంచలన తీర్పు వెల్లడించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఇక తాజాగా హిజాబ్ వివాదంపై ద్విసభ్య ధర్మసనం ఎటూ తేల్చలేకపోయింది. ఇద్దరు జడ్జీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో హిజాబ్ వివాదం విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసే అవకాశం ఉంది.