»Brs Party Leaders Reached To Delhi On Kavitha Arrest News Alert
Kavitha Probe కవిత అరెస్ట్ వార్తలు.. ఢిల్లీలో మొహరించిన గులాబీ దండు
కవిత వ్యవహారాన్ని మొత్తం తెలంగాణపై దాడిగా ఆపాదించేందుకు సిద్ధమైంది. ఒకవేళ కవిత అరెస్ట్ అయితే రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధమైంది.
భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi- BRS Party)లో ఆందోళన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం (Delhi Liqour Scam)లో పరిణామాలు వేగంగా మారుతుండడంతో ఆ పార్టీ ఎమ్మెల్సీ, భారత జాగృతి (Bharath Jagruthi) వ్యవస్థాపకురాలు కవిత (Kalvakuntla Kavitha) మెడ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఒకసారి విచారణ ఎదుర్కొన్న కవిత ఈసారి నేరుగా ఢిల్లీలో ఈడీ (ED) సమన్లు అందించింది. మార్చి 9న జరుగాల్సిన విచారణ ముందస్తు కార్యక్రమాల నేపథ్యంలో మార్చి 11న కవిత విచారణ (Investigation)కు హాజరు కానుంది. కాగా ఈ కుంభకోణం వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం తదుపరి అరెస్ట్ కవిత ఉంటుందని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీ ముఖ్య నాయకులంతా ఢిల్లీలో మొహరించారు.
కవితను అరెస్ట్ చేస్తే ఏ విధంగా ముందుకు వెళ్లాలని సమాలోచనలు చేస్తున్నారు. కవిత అరెస్ట్ అయితే ఢిల్లీలో భారీ ధర్నాకు దిగాలని గులాబీ పార్టీ చూస్తున్నది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (K Chandrashekar Rao) ఆదేశాల మేరకు ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు పార్టీ ముఖ్య నాయకులంతా హస్తినకు చేరుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కవిత సోదరుడు మంత్రి కేటీఆర్, మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఢిల్లీకి చేరుకున్నారు. ఇక మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ఇప్పటికే ఢిల్లీలోనే ఉన్నారు. పార్టీ ఎంపీలు నామా నాగేశ్వర రావు, కే కేశవరావు, వెంకటేశ్ నేత, మాలోత్ కవిత, జోగినపల్లి సంతోశ్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర తదితరులు అక్కడే మకాం వేశారు. జరిగే పరిణామాలను బట్టి ముందుకు వెళ్లాలని పార్టీ నిర్ణయించింది. ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నా సంయమనం పాటించాలని ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలు చేపట్టాలని గులాబీ పార్టీ భావిస్తున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులంతా కూడా ఢిల్లీకి చేరుకోనున్నారు.
తెలంగాణ నాయకత్వమంతా ఢిల్లీకి చేరుకుంటున్నది. సీఎం కేసీఆర్ కూడా శుక్రవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ‘కవిత అరెస్ట్ తప్పదు. అరెస్ట్ చేస్తే చేసుకోని’ అని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె అరెస్ట్ తథ్యమని అందరూ ఓ నిర్ణయానికి వచ్చారు. జాతీయ రాజకీయాల్లో పార్టీ విస్తృతమవుతుండడంతోనే కట్టడి చేయడంలో భాగంగా కవితను అస్త్రంగా చేసుకుని బీజేపీ ఆడిస్తున్న డ్రామాగా బీఆర్ఎస్ అభివర్ణిస్తోంది. ఇదే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఒక వ్యూహం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే ఢిల్లీ కుంభకోణంపై ప్రతిపక్ష పార్టీల నాయకులంతా కలిసి ఉమ్మడి లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలపై విచారణ సంస్థలను ఉసిగొల్పుతున్నారని, కక్షసాధింపు చర్యలు చేపడుతున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే. ఇది పద్ధతి కాదని లేఖలో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
ఇక కవిత అరెస్ట్ తో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారే అవకాశం ఉంది. కాగా కవిత అరెస్ట్ ను ప్రతిపక్షాలు చేసే రాద్ధాంతాన్ని తిప్పికొట్టేందుకు కూడా గులాబీ పార్టీ వ్యూహం రచించింది. కవిత అరెస్ట్ ను తెలంగాణపై దాడిగా మళ్లించేందుకు ఇప్పటికే వ్యూహం సిద్ధం చేసుకున్నారు. నోటీసులు అందుకున్న తర్వాత కవిత ‘తెలంగాణ తల వంచదు’ అని చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. కవిత వ్యవహారాన్ని మొత్తం తెలంగాణపై దాడిగా ఆపాదించేందుకు సిద్ధమైంది. ఒకవేళ కవిత అరెస్ట్ అయితే రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధమైంది. శనివారం కవిత విచారణకు వెళ్తుండడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది.