కేరళ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలను దారుణంగా నరబలి ఇచ్చారు. మూఢనమ్మకంతో… తమ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్మి… ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చారు. ఈ దారుణ ఘటన పత్తినంతిట్ట జిల్లాలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే… కోచిలోని కడవంతర, సమీపంలోని కాలడికి చెందిన ఇద్దరు మహిళలు లాటరీ టికెట్లు అమ్ముకుని పొట్టపోసుకునేవారు. వీరిలో ఒకరు జూన్, మరొకరు సెప్టెంబర్ నుంచి కనిపించకుండా పోయారు. వారి సెల్ నంబర్లు, టవర్ లొకేషన్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి.
మహిళలిద్దరినీ పత్తనంతిట్ట జిల్లా తిరువల్లలో ఉండే మసాజ్ థెరపిస్ట్ భగావల్ సింగ్, అతడి భార్య లైలా బలి ఇచ్చినట్లు తేలింది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, సంపన్నులు కావాలంటే నరబలి తప్పదని వారి మిత్రుడైన పెరుంబవరూర్కు చెందిన రషీద్ అలియాస్ ముహమ్మద్ షఫీ సలహా ఇచ్చాడు. ఇతడే బాధిత మహిళలకు డబ్బు ఆశ చూపి భగావల్ సింగ్ ఇంటికి తీసుకువచ్చాడు.
ఆ ఇంట్లోనే మంత్రాలు చేసి, ఒకరిని జూన్లో మరొకరిని సెప్టెంబర్లో గొంతుకోసి చంపారు. అనంతరం షఫీ సాయంతో మృతదేహాలను ముక్కలుగా నరికి సొంతింటి ఆవరణలో, ఇలాంతూర్లో పాతిపెట్టారు. సింగ్ దంపతులతోపాటు షఫీని మంగళవారం కస్టడీలోకి తీసుకున్నట్లు కోచి నగర పోలీస్ కమిషనర్ నాగరాజు చకిలం చెప్పారు. కాలడికి చెందిన మహిళ ఆచూకీ తెలుసుకునే క్రమంలోనే రెండో ఘటన వెలుగు చూసిందన్నారు.వీటిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.