ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మెగా స్టార్ చిరంజీని కలిశారు. వీరిద్దరూ కలవడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే… కేవలం గాడ్ ఫాదర్ సినిమా గురించి మాత్రమే చర్చ జరిగినట్లు వారు చెబుతున్నప్పటికీ… రాజకీయాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
పవన్‌పై చిరంజీవి తాజా రాజకీయ వ్యాఖ్యల నేపథ్యంలో ఇరువురి నాయకుల భేటీపై పలు ఊహాగానాలు మొదలయ్యాయి. భవిష్యత్తులో జనసేనకు మద్దతు ఇస్తానేమో అంటూ చిరంజీవి ఇటీవలే నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. పవన్ నిబద్ధత గురించి తనకు తెలుసని, అటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని మెగాస్టార్ అన్నారు. మెగాస్టార్ ఒకవేళ జనసేనలోకి ఎంట్రీ ఇస్తే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఘంటా శ్రీనివాసరావు చిరంజీవిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
నిజానికి… చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన నాటి నుంచి గంటా శ్రీనివాసరావుకి మెగాస్టార్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తాను ఏ పార్టీలోకి వెళ్లినా చిరంజీవితో అదే విధమైన ఆత్మీయ సంబంధాలను నిలుపుకుంటూ వస్తున్నారు. మరోవైపు రాజకీయాల్లో కూడా ఎప్పటికప్పుడు చాకచక్యంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. విశాఖలో భీమిలి నుంచి ఓ సారి, నార్త్ విశాఖ నుంచి మరోసారి గెలిచి తన సత్తా చాటుకున్నారు. ఎక్కడ నుంచి పోటీకి దిగినా గెలుపు సొంతం చేసుకోవడంతో ఆరితేరిన నేతగా గంటా ఎదిగారు.
మరోవైపు స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పాల్గొని తన ఉనికిని చాటుకున్నారు. ఏపీలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధిగా ఉన్న గంటా ఇటీవల కాలంలో తరచుగా కాపు సంఘాల నేతలతో టచ్‌లో ఉంటున్నారు. పలు సమావేశాలకు హాజరౌతున్నారు. కాపు సామాజిక వర్గాన్ని ఏకం చేసి సమస్యలపై పోరాడడానికి ఓ ఫోరమ్ కూడా ఏర్పాటు చేశారు.