Adenovirus భారత్ లో మరో వైరస్ కలకలం.. చిన్నారులు జాగ్రత్త
వైరస్ లక్షణాలు ఇంకా తెలియరాలేదు. ఆ వైరస్ బారినపడిన వారి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. వాటి ఫలితాలు వచ్చాక వైరస్ లక్షణాలు తెలిసే అవకాశం ఉంది. ఈ వైరస్ సాధారణంగా శ్వాసకోశ, పేగులలో ఇన్ఫెక్షన్ లకు కారణమవుతుంది. ఇది సర్వసాధారణమే.
కరోనా వైరస్‌తో (Corona Virus) సృష్టించిన విలయం నుంచి భారత్ ఇంకా తేరుకోలేదు. వైరస్ ధాటికి భారతదేశం (India) అల్లాడిపోయింది. మహమ్మారి సృష్టించిన విపత్తుతో మానవ సమాజం గజగజ వణికింది. ఇప్పుడిప్పుడే ఆ వైరస్ నుంచి మెల్లమెల్లగా కోలుకుంటున్నాం. ఇప్పటికే ఆ వైరస్ ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాని ప్రభావం మానవుడి ఆరోగ్యంపై తీవ్రంగా పడింది. ఆ విలయం మరచిపోతున్న సమయంలో మరికొన్ని వైరస్ ల దాడి పొంచి ఉన్నాయని శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారి హెచ్చరిస్తున్నట్టుగానే భారత్ పై మరో వైరస్ (Virus) దాడి చేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా చిన్నారులపై ఆ వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ ప్రభావంతో ఒక్క రోజే ఏడుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. దీంతో భారతదేశంలో మళ్లీ కలకలం ఏర్పడింది.
ఆ వైరస్ పేరు అడెనో వైరస్ (Adenovirus). ఈ వైరస్ కారణంగా పశ్చిమ బెంగాల్ (West Bengal)లో 24 గంటల్లో ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. వారంతా రెండేళ్లలోపు వారే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సంఘటనలతో మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ నియంత్రణ చర్యలకు ఉపక్రమించింది. ఈ వైరస్ కారణంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ తో చిన్నారులు మరణించారని ఆ రాష్ట్ర సీనియర్ ఆరోగ్య అధికారి వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 12 వైరస్ మరణాలు సంభవించాయని తెలిపారు. వారిలో 8 మందికి మిగతా సమస్యలు కూడా ఉన్నాయని వివరించారు.
ప్రస్తుత కాలంలో తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు (ARI) సర్వసాధారణమని, జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ వైరస్ ను ఎదుర్కొనేందుకు వైద్య వసతులు పెంచామని అధికారులు తెలిపారు. 121 ఆస్పత్రుల్లో 600 మంది పిల్లల వైద్యులతో పాటు 5 వేల పడకల (Beds)ను సిద్ధంగా ఉంచారు. కలకత్తా (Kolkata)లోని ప్రభుత్వ ఆస్పత్రులలో ఐదుగురు, బంకురా సమ్మిలాని బోధన ఆస్పత్రిలో ఇద్దరు మృతి చెందారు. వైరస్ లక్షణాలు ఇంకా తెలియరాలేదు. ఆ వైరస్ బారినపడిన వారి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. వాటి ఫలితాలు వచ్చాక వైరస్ లక్షణాలు తెలిసే అవకాశం ఉంది. ఈ వైరస్ సాధారణంగా శ్వాసకోశ, పేగులలో ఇన్ఫెక్షన్ లకు కారణమవుతుంది. ఇది సర్వసాధారణమే. కానీ మరణాల (Deaths) సంఖ్య పెరగడమే ఆందోళన కలిగిస్తోంది.
ఈ వైరస్ పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంటనే వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశించారు. సీసీయూ (CCU), జనరల్ వార్డుల్లో (General Ward) పడకల సంఖ్య పెంచాలని చెప్పారు. ముఖ్యంగా 0-2 సంవత్సరాల వయసులోపు పిల్లలు సంక్రమణకు గురవుతారని, వారిని ఇంట్లో ఉంచే చికిత్స అందించవచ్చని ఈ సందర్భంగా సీఎం మమతకు అధికారులు వివరించారు.