»Young Boy Shipped To Different Country While Playing Hide And Seek
Hide and Seek: గేమ్ ఆడుతూ మరో దేశానికి వెళ్లిన బాలుడు
ఓ బాలుడు దొంగా పోలీస్ వంటి హైడ్ అండ్ సీక్ (Hide and Seek) గేమ్ ఆడుతూ ఏకంగా తన దేశాన్ని దాటి, మరో దేశానికి వెళ్లిన ఆసక్తికర సంఘటన బంగ్లాదేశ్ (Bangladesh)లో జరిగింది.
ఓ బాలుడు దొంగా పోలీస్ వంటి హైడ్ అండ్ సీక్ (Hide and Seek) గేమ్ ఆడుతూ ఏకంగా తన దేశాన్ని దాటి, మరో దేశానికి వెళ్లిన ఆసక్తికర సంఘటన బంగ్లాదేశ్ (Bangladesh)లో జరిగింది. హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడే సమయంలో ఎవరికీ దొరకకుండా పిల్లలు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కనిపించని చోట దాచుకునే ప్రయత్నాలు చేస్తారు. ఇలాంటి ప్రయత్నం చేసిన ఓ కంటైనర్ లో దాక్కోవడంతో బంగ్లాదేశ్ నుండి మలేషియా (malaysia) వెళ్లాడు. హైడ్ అండ్ సీక్ కోసం కంటైనర్ లో దాక్కున్న ఆ బాలుడిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బంగ్లాదేశ్ కు చెందిన పదిహేనేళ్ల రతుల్ ఇస్లామ్ ఫహీమ్ ఇక్కడి పోర్ట్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతను తన స్నేహితులకు చిక్కకుండా ఉండేందుకు అక్కడే ఉన్న కంటైనర్ లో దాక్కున్నాడు. అయితే అతను అందులో అలాగే నిద్రపోయాడు. అతనికి మెలకువ వచ్చేసరికి కంటైనర్ లో లాక్ అయి ఉన్నట్లు గుర్తించాడు. మరోవైపు, తల్లిదండ్రులు, స్నేహితులు అతను కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరంతా అతని కోసం గాలిస్తున్నారు. అతనిని ఎవరైనా ఎత్తుకొని పోయి ఉంటారని ఆందోళన చెందారు తల్లిదండ్రులు.
బాలుడు ఉన్న కంటైనర్ చిట్టగాంగ్ నుండి జనవరి 12వ తేదీన డిపార్ట్ అయింది. జనవరి 17న మలేషియా పోర్ట్ క్లాంగ్ కు చేరుకున్నది. కంటైనర్ లో తనిఖీ చేస్తున్న సమయంలో చిన్న చిన్న శబ్దాలు వినిపించడంతో మరింతగా వెతికి, బాలుడిని గుర్తించిన పోలీసులు సమాచారం ఇచ్చారు. తన ఇంటికి 2000 మైళ్ల దూరం వెళ్లిపోయాడు. కంటైనర్ లోనే దాదాపు వారం రోజులు ఉండటంతో అస్వస్థతకు గురయ్యాడు. జ్వరం వచ్చింది. చికిత్స కోసం క్లాంగ్ లోని టెంగ్కు అంపౌన్ రహిమా హాస్పిటల్ కు తరలించారు. అతను కోలుకున్నాడు. బాలుడు కంటైనర్ లో ఉండిపోవడంపై అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ… ఇది యాదృచ్చికంగా జరిగిందని, పాహిమ్ ను రక్షించినట్లు చెప్పారు. ఇందులో ఎలాంటి మానవ అక్రమ రవాణా కనిపించడం లేదన్నారు. తనంతట తానే కంటైనర్ లోకి ప్రవేశించాడని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. బాలుడిని తల్లిదండ్రుల వద్దకు పంపించినట్లు మలేషియన్ ఇంటీరియర్ మినిస్టర్ సైఫుద్దీన్ నాసుషన్ వెల్లడించారు.