ఒకప్పుడు దేశం మొత్తాన్ని ఏలిన పార్టీ కాంగ్రెస్. కానీ ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో కనీసం అడ్రస్ లేకుండా పోయింది. నిజానికి కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేకపోవడం కూడా ఒక కారణమనే చెప్పాలి. గత పదేళ్లుగా కాంగ్రెస్ కేంద్రంలో ప్రతిపక్షంగానే మిగిలిపోయింది. అయితే… వచ్చే ఎన్నికల్లో అయినా.. కేంద్రంలోని బీజేపీకి గట్టి పోటీ ఇవ్వాలని కాంగ్రెస్ చూస్తోంది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ నడుం బిగించారు. జోడో యాత్ర మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆయన యాత్ర కర్ణాటక రాష్ట్రంలో కొనసాగుతోంది.
కాగా.. రాహుల్ జోడో యాత్రకు సోనియాగాంధీ కొత్త జోష్ తీసుకువచ్చారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈ యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో పాటు కొన్ని నిమిషాల పాటు పాదయాత్ర చేశారు. రాహుల్ కు సంఘీభావంగా నిలిచారు. ఇటీవల కాలంలో అనారోగ్య కారణాలతో ఎటువంటి పబ్లిక్ సమావేశాల్లో సోనియాగాంధీ పాల్గొనలేదు.
చాలా కాలం తర్వాత ఓ పబ్లిక్ ఈవెంట్లో పాల్గొంటున్నందున కాంగ్రెస్ పార్టీలో మరింత జోష్ వచ్చింది. కార్యకర్తలు, నాయకులు సోనియాగాంధీకి ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా నీరాజనాలు పలికారు. సోనియాగాంధీ కూడా చిరునవ్వులు చిందిస్తూ ఎంతో ఉత్సాహంగా రాహుల్‌తో పాటు కదిలారు. వేలాది మంది ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.
కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ సోనియాగాంధీ రాకతో ఎంతో సంతోషంగా ఉన్నారు. కర్ణాటక వీధుల్లో మేడమ్ సోనియాగాంధీ నడవడం తమకెంతో గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. కర్ణాటకలో త్వరలోనే కాంగ్రెస్ అధికారంలోకి రానుందని, బీజేపీ దుకాణం మూతపడక తప్పదని ధీమా వ్యక్తం చేశారు.
సెప్టెంబర్ 30న కర్ణాటకలో ప్రవేశించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అత్యంత ఉత్సాహకర వాతావరణంలో సాగుతోంది. రాహుల్ గాంధీ ఆలయాలను, మసీదులను,చర్చిలను సందర్శిస్తూ మత పెద్దల ఆశీర్వాలు తీసుకుంటున్నారు. వీలున్న చోటల్లా కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. 4 రోజుల క్రితం జరిగిన ఓ సభలో జోరు వానలో తడిసి ముద్దవుతూ కూడా రాహుల్ గాంధీ ప్రసంగం చేశారు.
రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర దేశంలోని 12 రాష్ట్రాల గుండా 3500 కిలోమీటర్ల పాటు సాగనుంది. కన్యాకుమారి నుంచి మొదలైన ఈ యాత్ర కశ్మీర్లో ముగియనుంది.