ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్, తమిళనాడు ప్రభుత్వం మధ్య శనివారం తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్, ఓలా సిఇఒ భవిష్ అగర్వాల్ సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీ కోసం తమిళనాడులో 920 మిలియన్ డాలర్లు (రూ. 7,614 కోట్లు) ఓలా పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది.
ఓలా(ola) ఎలక్ట్రిక్ సంస్థ దేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ క్రమంలో వచ్చే ఐదేళ్లలో తమిళనాడులో 920 మిలియన్ డాలర్లు (రూ. 7,614 కోట్లు) పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది. ఈ డబ్బును ఎలక్ట్రిక్ కార్లు(electric cars), ఎలక్ట్రిక్ వాహనాల (EVs) బ్యాటరీల తయారీకి ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. దీంతో ప్రపంచంలోనే అతి పెద్ద ఈవీ హాబ్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్, తమిళనాడు ప్రభుత్వం మధ్య శనివారం ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్(M K Stalin), ఓలా సీఈఓ(CEO) భవిష్ అగర్వాల్(Bhavish Aggarwal) సమక్షంలో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత భవిష్ ట్విట్టర్ ద్వారా వివరాలను పంచుకున్నారు.
Ola will setup the worlds largest EV hub with integrated 2W, Car and Lithium cell Gigafactories in Tamil Nadu.
Signed MoU with Tamil Nadu today. Thanks to Hon. CM @mkstalin for the support and partnership of the TN govt!
Ola అనుబంధ సంస్థలైన Ola ఎలక్ట్రిక్ టెక్నాలజీస్, Ola సెల్ టెక్నాలజీస్ ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడి చేస్తుంది. భారతదేశంలో EVలకు పెరుగుతున్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దాదాపు 3,000 మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయని అక్కడివారి అంచనా వేస్తున్నారు. రూ.7,614 కోట్లలో దాదాపు రూ.5,100 కోట్లు సెల్ తయారీ ప్లాంట్‌లోకి వెళ్తాయి. మిగిలిన రూ.2,500 కోట్లు సంవత్సరానికి 1.4 లక్షల కార్లను తయారు చేయగల సామర్థ్యం కలిగిన నాలుగు చక్రాల ప్లాంట్‌పై ఖర్చు చేయనున్నారు.
దేశంలోని ఆటోమోటివ్ ఎగుమతుల్లో దాదాపు మూడింట ఒక వంతు వాటాను కలిగి ఉన్న తమిళనాడు EV తయారీ రంగాన్ని పెంచాలని చూస్తోంది. ఈ క్రమంలో EVలకు రహదారి పన్ను, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, పర్మిట్ ఫీజులను సైతం మాఫీ చేస్తోంది. అయితే రూ. 50,000 కోట్ల పెట్టుబడులను సేకరించడంతోపాటు 1.50 లక్షల ఉద్యోగాలను సృష్టించడం ఈ విధానం లక్ష్యమని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ఈ లక్ష్యానికి మద్దతు ఇవ్వడానికి తమిళనాడు(tamilnadu) రాష్ట్రంలో పనిచేస్తున్న వాహన సముదాయాలను విద్యుదీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు పరికరాల తయారీదారులు, ఆటో కాంపోనెంట్, నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్, R&D సామర్థ్యాలతో కూడిన శక్తివంతమైన ఆటోమోటివ్ పర్యావరణ వ్యవస్థను ఉపయోగించుకోనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.