Nara lokesh: ఆ క్రెడిట్ అంతా జగన్ కే ఇచ్చేసిన లోకేష్
తన యువగళం పాదయాత్రలో లోకేష్ ప్రభుత్వం పైన నిప్పులు చెరుగుతున్నారు. తనదైన శైలిలో జగన్ పై విమర్శలు చేస్తున్నారు. మధ్యలో తన మామ బాలకృష్ణ సినిమాల్లోని డైలాగులతో కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు.
తన పాదయాత్రకు (yuvagalam) ప్రజల నుండి వస్తున్న ఆదరణ, స్పందనను చూసి తట్టుకోలేక తన మైకును లాక్కెళ్లారని, అయితే వాళ్లు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే తన మైకును వారు లాక్కోవచ్చు… కానీ తన గొంతును మాత్రం నొక్కేయలేరని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara lokesh) అన్నారు. కుర్చీ కూడా లాక్కుంటే గోడ ఎక్కి మాట్లాడుతానని, లేదంటే కార్యకర్తల భుజం పైన నిలబడి ప్రసంగిస్తానని చెప్పారు. శ్రీరంగరాజపురం మండలం పుల్లురు క్రాష్ రోడ్ వద్ద మాట్లాడుతుంటే పోలీసులు మైకుకు అనుమతి ఇవ్వలేదు. పలుచోట్ల ఇలా జరిగింది. మైకు లాక్కెళ్లి సందర్భం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవలి కాలంలో స్పీడ్ అయ్యానని చెబుతున్నారని, తన తండ్రి చంద్రబాబు (Chandrababu Naidu) కూడా అంత స్పీడ్ అయ్యావు ఏంటి అని అడిగారని, ఈ క్రెడిట్ అంతా జగన్ రెడ్డిదేనని (ys jagan) చమత్కరించారు. 2020లో అమరావతి ఉద్యమంలో పాల్గొన్నప్పుడు తనను అరెస్టు చేసి స్టేషన్కు తీసుకెళ్లారని, ఈ మూడున్నర ఏళ్లలో ఏడుసార్లు జరిగిందని, ఇప్పుడు తనకు స్టేషన్ అత్తగారిల్లులా మారిపోయిందని చురకలు అంటించారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే పాటను పెడుతుంటే సౌండ్ వెహికల్స్ను పోలీసులు సీజ్ చేశారని, ఇక నుంచి అందరి సెల్ఫోన్లలో ఈ పాటలు పెట్టుకుని పాదయాత్ర చేద్దామని పిలుపునిచ్చారు. ఎంతమంది సెల్ఫోన్లను పోలీసులు లాక్కెళతారో చూద్దామని సవాల్ చేశారు. ప్రతిరోజూ ఏదో వంకతో కేసు నమోదు చేస్తున్నారని, తన 400 రోజుల పాదయాత్ర ముగిసేసరికి 400 కేసులు నమోదు అయినా ఆశ్చర్యం లేదన్నారు.
రాష్ట్రంలో ఎవరిని కదిలించినా వైసీపీ ప్రభుత్వ బాధితులే ఉన్నారని, అన్ని వర్గాల ప్రజలు తనను కలిసి బాధలు చెప్పుకొంటున్నారన్నారు. జగన్ పిల్లిలా అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్నారన్నారు. దమ్ముంటే పులిలా నాకు మైకు ఇప్పించి మాట్లాడించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రశ్నలకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టిడిపి ప్రభుత్వంలో తాను రెండున్నరేళ్ల పాటు మంత్రిగా ఉన్నప్పటికీ ఎలాంటి తప్పు చేయలేదన్నారు. అందుకే ధైర్యంగా ప్రజల్లోకి వస్తున్నట్లు చెప్పారు. జగన్ మాత్రం ప్రజలకు భయపడి పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయింది టీడీపీ కాదు, రాష్ట్ర ప్రజకు అని వ్యాఖ్యానించారు. జగన్కు అనుభవం లేదు… అవగాహన లేదు… నేర్చుకోవాలనే ఉద్దేశ్యం అంతకంటే లేదన్నారు. రాజధాని విషయంలో టీడీపీకి స్పష్టత ఉందని, పరిపాలన ఒకేచోట ఉండాలని స్పష్టం చేశారు. కానీ అభివృద్ది వికేంద్రీకరణ ముఖ్యం అన్నారు. గతంలో జగన్ దెబ్బకు ఐఏఎస్ అధికారులు జైలుకు వెళ్లారని, ఈసారి రఘురామిరెడ్డి వంటి ఐపీఎస్ లు జైలుకు వెళ్తారన్నారు. జ్యుడీషియల్ విచారణ చేయించి చట్టాన్ని అతిక్రమించిన ఏ ఒక్కర్నీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
తన యువగళం పాదయాత్రలో లోకేష్ ప్రభుత్వం పైన నిప్పులు చెరుగుతున్నారు. తనదైన శైలిలో జగన్ పై విమర్శలు చేస్తున్నారు. మధ్యలో తన మామ బాలకృష్ణ సినిమాల్లోని డైలాగులతో కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు. భయం… నా బయోడేటాలో లేదురా బ్లడీ ఫూల్ అంటూ సభలోని వారితో చప్పట్లు కొట్టించుకున్నారు.