తనపై వచ్చిన చీటింగ్ ఆరోపణల పైన స్పందించారు సింగర్ యశస్వి కొండేపూడి(Yasaswi Kondepudi). నవసేనకు, అక్కడి పిల్లలకు సాయం చేస్తున్నానని లేదా వారిని దత్తత తీసుకున్నానని తాను ఎక్కడా చెప్పలేదన్నారు.
తనపై వచ్చిన చీటింగ్ ఆరోపణల పైన స్పందించారు సింగర్ యశస్వి కొండేపూడి(Yasaswi Kondepudi). నవసేనకు, అక్కడి పిల్లలకు సాయం చేస్తున్నానని లేదా వారిని దత్తత తీసుకున్నానని తాను ఎక్కడా చెప్పలేదన్నారు. తాను అసలు వాళ్ల దగ్గరకే వెళ్లలేదను చెప్పారు. ఈ విషయంలో తనకు అసలు సంబంధమే లేదని స్పష్టం చేశారు. అయితే సాధ్య ఫౌండేషన్‌కు తమ కుటుంబం సహాయం చేస్తూ ఉంటుందని, ఈ ఫౌండేషన్ తమకు నచ్చిన సంస్థలకు సాయం చేస్తుంటుందని తెలిపారు. అలా వాళ్లు కాకినాడలోని ఓ అనాధాశ్రమానికి సాయం చేశారన్నారు. తమ సోదరులు సాధ్య ఫౌండేషన్‌కు సహకరించినట్లు చెప్పారు. ఈ ఫౌండేషన్ ద్వారా వారు నవసేన ట్రస్టుకి మున్నాలుగు సార్లు సాయం చేశారని, కాబట్టి వాళ్లతో ఆల్ ది బెస్ట్ చెప్పించుకుంటామని తెలిపారు.
నవసేన నిర్వాహకులు ఫరా కుటుంబం ఎదురుగానే పిల్లలతో ఆల్ ది బెస్ట్ చెప్పిస్తూ వీడియోలు చేశారని వెల్లడించారు. తన అభిమాని ఒకరు కూడా ఆయన బర్త్ డే రోజున అదే పిల్లలతో కలిసి కేక్ కట్ చేశాడన్నారు. ఆ వీడియోలను చిన్నవిగా కట్ చేసి ప్రోమోలో యాడ్ చేశారని చెప్పారు. అందులో నవసేన బోర్డ్ కనిపించిందని తెలిపారు. అందులో మా బోర్డ్ ఉంది కానీ.. మా పిల్లలు లేరు అని నిర్వాహకురాలు ఫరా అడిగారని, దీనిపై ఆమె రాద్ధాంతం చేయడంతో ప్రోమోలో డిలీట్ చేసినట్లు చెప్పారు. మా బోర్డ్ కనిపించింది కాబట్టి ఆశ్రమాన్ని 9 నెలలు దత్తత తీసుకోవాలని అంటున్నారని, మాకు ఉన్నంతలో సాయం చేస్తాం.. కానీ అన్ని రోజుకంటే ఎలా అవుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె లీగల్ గా వెళ్తానంటే సరేనని చెప్పినట్లు తెలిపారు.
ఫరా ఆరోపణలు
కాగా… సరిగమప సింగర్ యశస్వి కొండేపూడి (Yasaswi Kondepudi) వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. కాకినాడకు చెందిన నవసేన ఫౌండేషన్ (Navasena Foundation) అతనిపై సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఫౌండేషన్ తనదని అతను చెప్పుకుంటున్నాడని, ఆయన మోసం చేశారని నిర్వాహకురాలు ఫరా (farah) ఆరోపించారు. 56 మంది పిల్లలను తనే చదివిస్తున్నట్లుగా చీటింగ్ చేశాడని తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ సింగింగ్ ప్రోగ్రాంలో ఈ పిల్లల ఫోటోలను యశస్వి ఉపయోగించుకున్నాడని, ఇందులో అబద్దాలు చెప్పినట్లు ఆరోపించారు. తనది కాని సంస్థను తనదని చెప్పుకోవడం, సామాజిక సేవ చేస్తున్నట్లు, పిల్లలను చదివిస్తున్నట్లు అబద్దాలు చెబుతున్నట్లుగా సింగర్ పైన ఆరోపణలు వచ్చాయి. దీని పైన యశస్వి స్పందించారు. నిర్వాహకురాలు ఈ అంశంపై మీడియా ఎదుటకు వచ్చారు.
అసలేం జరిగింది?
ఆమె మాట్లాడుతూ… తమ సంస్థ రిజిస్టర్ అయిందని, యశస్వికి (Yasaswi Kondepudi) చెందినవారు వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్లారని చెప్పారు. ఈ పేరును తన ప్రోగ్రాంలో వినియోగించుకున్నాడని, దానిని ప్రోమోలో పెట్టుకున్నాడని చెప్పారు. అయితే ఇదంతా తమకు తెలియకుండా జరిగిందన్నారు. గత అయిదేళ్లుగా తాను సొంత డబ్బులతో పిల్లలను పోషిస్తూ, చదివిస్తున్నట్లు చెప్పారు. నవసేన ఫౌండేషన్‌కు ఏ సెలబ్రిటీ నుండి కూడా సహకారం లేదని స్పష్టం చేశారు. తమ సంస్థ పేరును ఉపయోగించుకోవడంతో పాటు, తానే నడుపుతున్నట్లు చీటింగ్ చేసినందున ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు. యశస్వి ఎప్పుడూ ట్రస్ట్‌కు రాలేదని, ఆయనను నేరుగా ఎప్పుడూ చూడలేదన్నారు. ఫోన్లో మాత్రం ఇటీవల మాట్లాడినట్లు చెప్పారు. ప్రోగ్రాంలో తమ ఫౌండేషన్‌ను ఉపయోగించుకోవడంపై ప్రశ్నించగా, తాను కనుక్కొని, వచ్చి మాట్లాడుతానని చెప్పాడని వెల్లడించారు. ఆయన నిజానిజాలు తెలుసుకొని, వస్తే కానీ అసలు విషయం వెల్లడవుతుందన్నారు. ఆమె తీవ్ర ఆరోపణలు చేయడంతో యశస్వి వివరణ ఇచ్చారు.