నారా లోకేష్ అతి కష్టంగా పాదయాత్ర చేయడం చూస్తుంటే తనకు చాలా బాధ వేస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి ఉంటే అమరావతిలో శాశ్వత భవనాలు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అతి కష్టంగా పాదయాత్ర చేయడం చూస్తుంటే తనకు చాలా బాధ వేస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి ఉంటే అమరావతిలో శాశ్వత భవనాలు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టిన, విభజిత ఏపీని అప్పుల పాలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో చివరి అవకాశం ఇస్తే… రాష్ట్ర ప్రజలకు కూడా అవే చివరి రోజులు అన్నారు. ఒక మాట ఇస్తే, ఆ మాట మీద నిలబడే ముఖ్యమంత్రిని మీరు దేశంలో ఎక్కడా చూసి ఉండరని వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ దృష్టి అంతా సంక్షేమం.. అభివృద్ధి పైన ఉందన్నారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని, వెనుకబడిన రాష్ట్రాన్ని ఈ రోజు టాప్ 5లోకి తెచ్చాడని కితాబిచ్చారు. రాష్ట్రం తిరిగి పరుగు పెట్టడానికి ముఖ్యమంత్రి ప్రతిభ, సుపరిపాలన కారణమన్నారు. మిగతా ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాలు సర్‌ప్లస్‌లో ఉన్నప్పటికీ సంక్షేమం విషయంలో మన ముఖ్యమంత్రి చేసినట్లుగా చేయలేకపోతున్నారన్నారు. జగన్‌కు చేయాలనే చిత్తశుద్ధి ఉంది కాబట్టే సాధ్యమవుతోందన్నారు.
సూర్యలంక బీచ్‌లో…
కరోనా వల్ల దేశంతో పాటు యావత్ ప్రపంచంలో పర్యాటకరంగం అతలాకుతలమైందని, ఇప్పుడిప్పుడే ఈ రంగం కోలుకుంటోందని చెప్పారు. విశాఖలో టూరిజం, ఇండస్ట్రీ కలిపి ఇన్వెస్టర్స్ సమ్మిట్ పెట్టనున్నట్లు చెప్పారు. టూరిజం అభివృద్ధిలో పీపీపీ మోడల్ కోసం తాము వేచి చూస్తుండగా, అందుకు కదలిక వచ్చిందన్నారు. బాపట్ల సమీపంలోని సూర్యలంక బీచ్‌ని సందర్శించిన ఆమె, దానిని మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తామన్నారు. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి వీకెండ్స్‌లో పది, పదిహేనువేల మంది పర్యాటకులు ఫ్యామిలీ, ప్రెండ్స్‌తో వస్తారన్నారు. ముఖ్యంగా కార్తీకమాసంలో లక్షలాదిమంది వచ్చి, శివుడికి పూజలు చేస్తారన్నారు. విశాఖ తర్వాత ఇక్కడకు ఎంతోమంది వస్తారన్నారు. మూడు ఎకరాల్లో హరిత రిసార్టు ఉందని, మరిన్ని గదులు నిర్మిస్తామన్నారు. ఈ బీచ్‌ను మరింత అభివృద్ధి చేసి, పర్యాటకులను పెంచే ప్రయత్నం చేస్తామన్నారు. విశాఖ, తిరుపతి, పశ్చిమ గోదావరి, ఇప్పుడు బాపట్ల.. ఇలా అన్నిచోట్ల తిరిగి ఏం అభివృద్ధి చేపట్టాలో చూస్తున్నట్లు చెప్పారు.
ఇదిలా ఉండగా, బీచ్ పర్యటన సందర్భంగా అధికారితో తన చెప్పులు మోయించినట్లుగా రోజా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బీచ్‌కు వచ్చిన మంత్రి సముద్రంలోకి వెళ్లే ముందు తన చెప్పులను అక్కడ వదిలారు. మేడం గారి చెప్పులు జాగ్రత్త అంటూ పీఏ… అక్కడి పర్యాటక శాఖ ఉద్యోగిని ఆదేశించారు. దీంతో సదరు అధికారి చెప్పులను చేత్తో పట్టుకున్నారు. మంత్రి వచ్చాక ఆ చెప్పులు ఇచ్చారు. ఇది చర్చనీయాంశంగా మారింది.