»Natural Ways To Lower Cholesterol Without Medication
Cholesterol : కొలస్ట్రాల్తో ఇబ్బందా? సహజంగా తగ్గించుకునే మార్గాలివిగో
ఈ మధ్య కాలంలో కొలస్ట్రాల్ సంబంధిత సమస్యలతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకోసం రోజూ మందులూ వేసుకుంటున్నారు. అయితే దీన్ని తగ్గించుకునేందుకు ఉన్న సహజమైన మార్గాలేమిటో తెలుసుకుంటే.. మందులను వాడక్కర్లేకుండానే దీన్ని నియంత్రించుకోవచ్చు. అవేంటంటే?
Natural Ways to Reduce Cholesterol : బీపీ, షుగర్ల తర్వాత ఇటీవల కాలంలో వినిపిస్తున్న ప్రధాన సమస్యలో కొలస్ట్రాల్(cholesterol) ఒకటి. శరీరంలో చెడు కొవ్వులు(LDL) ఎక్కువ అవడం వల్ల ఇది మనకు అనారోగ్య సమస్యగా మారుతుంది. దీంతో దీన్ని కరిగించుకునేందుకు చాలా మంది మందులు వాడుతుంటారు. అయితే ఆహారంలో చెడు కొవ్వుల్ని తగ్గించి, మంచి కొవ్వులను తీసుకోవడం పెంచుకుంటే దీనికి చెక్ పెట్టడం సులభమే. అందుకు మనం ఏం చేయాలో వైద్య నిపుణులు చెబుతున్నారిక్కడే. మరింకెందుకు ఆలస్యం చదివేయండి.
చెడు కొలస్ట్రాల్ (LDL) ఎక్కువగా ఉన్న వారిలో గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం లాంటివి వచ్చే ప్రమాదాలు ఉంటాయి. మరి దీన్ని తగ్గించుకునేందుకు మంచి కొవ్వుల్ని ఎక్కువగా తీసుకోవాలి. మనం తినే వాటిలో శాచ్యురేటెడ్ ఫ్యాట్స్, మోనో శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అని ఉంటాయి. ఆహారంలో శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ తగ్గించి, మోనో శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉండే పదార్థాలు తినాలి. ఇవి మనలో చెడు కొలస్ట్రాల్ని తగ్గించి, మంచి కొలస్ట్రాల్ని పెంచుతాయి. ఆలివ్ నూనె, అవకాడో, నట్స్ తదితరాల్లో మోనో శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి.
ఈ కొలస్ట్రాల్(cholesterol) సమస్యలతో ఇబ్బంది పడే వారు రోజూ తప్పకుండా వ్యాయామం చేయాలి. అందువల్ల చెడు కొలస్ట్రాల్ కరగడమే కాకుండా కండరాలు కూడా బలంగా తయారవుతాయి. టైప్ 2 డయాబెటిస్ లాంటివి రాకుండా ఉంటాయి. ఈ విషయం అనేక అధ్యయనాల్లో సైతం వెల్లడైంది. పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, పప్పు ధాన్యాల ద్వారా నేరుగా కొవ్వుల్ని తీసుకోవడం వల్ల చెడు కొలస్ట్రాల్ చెప్పుకోదగ్గ రీతిలో తగ్గినట్లు తేలింది. ఇలాంటి సమస్యలు ఉన్న వారు బరువును నియంత్రణలో ఉంచుకోవడం కూడా ఆవస్యకం. అందుకోసం జంక్ ఫుడ్స్, నూనెల్లో వేపించిన ఆహారాల్లాంటి వాటిని తగ్గించి మోనో శాచ్యురేటెడ్ ఫ్యాట్ తీసుకోవాలి. అలాగే అధికంగా ఫైబర్ ఉన్న ఆహారాలు సైతం శరీరంలో LDL తగ్గడంలో సహాయపడతాయి.