LPG Cylinders: మీరు గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా… అయితే తక్షణం ఈ వార్త చదవాల్సిందే. ఇకపై మీరు తీసుకునే వంట గ్యాస్ సిలిండర్లకు క్యూఆర్ కోడ్ అందుబాటులోకి రానుంది. ఎల్పీజీ సిలిండర్లకు త్వరలోనే క్యూఆర్ కోడ్ ఇవ్వాలన్న ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో జరుగుతున్న అవకతవకలను నివారించడం, వంట గ్యాస్ సిలిండర్ల ట్రాకింగ్, ఏజెన్సీల ఇన్వెంటరీల నిర్వహణకు ఈ క్యూఆర్ కోడ్ నిర్ణయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
గ్యాస్ సిలిండర్ల క్యూఆర్ కోడ్ ముసాయిదాను ఎల్పీజీ సిలిండర్ రూల్స్ జీసీఆర్‌లో పొందుపరిచామన్నారు. త్వరలోనే క్యూఆర్ కోడ్ అమలుపై తుది నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. క్యూఆర్ కోడ్ అందుబాటులోకి వస్తే సిలిండర్ల సరఫరాలో జరుగుతున్న అవకతవకలను అరికట్టేందుకు ఇవి ఉపయోగపడుతాయన్నారు. పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా మండలి పని తీరు సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో పెట్రోలియం, పేలుడు పదార్థాలు, టపాసులు, ఇతర సంబంధిత పరిశ్రమల ప్రముఖల నుంచి అభిప్రాయల సేకరణకు గత బుధవారం దేశ రాజధానిలో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ ప్రకటన చేశారు. మరోవైపు.. నివాసాలకు 30 మీటర్ల నుంచి 50 మీటర్ల లోపు సైతం పెట్రోల్ బంకులు నిర్వహించేందుకు అవసరమైన భద్రతా చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను రూపొదించాలని పెట్రోలియం అండే ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ను ఆదేశించినట్లు పీయూష్ గోయల్ తెలిపారు .