Hathras Stampede : ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌లో తొక్కిసలాట(Hathras Stampede) జరిగి 121 మంది ఇప్పటి వరకు మృతి చెందారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా(Main Accused) ఉన్న దేవ్ ప్రకాష్ మధుకర్ అనే వ్యక్తి అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. ఈనెల రెండున నిర్వహించిన భోలే బాబా(bhole baba) సత్సంగ్ కార్యక్రమానికి ఇతడు ఆర్గనైజర్‌గా ఉన్నాడు. అతడు ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతడిని ఢిల్లీ(Delhi) పోలీసులు అదుపులోకి తీసుకున్నారని దేవ్ ప్రకాశ్ తరఫు న్యాయవాది ఏపీ సింగ్ వెల్లడించారు. ఈ విషయమై ఆయన ఓ వీడియోని విడుదల చేశారు.
ఆ వీడియోలో న్యాయవాది మాట్లాడుతూ.. మధుకర్ హార్ట్ పేషెంట్ అని చెప్పారు. ఆయనకి ఎలాంటి హానీ జరగకూడదని అన్నారు. ముందస్తు బెయిల్ కోసం కూడా తాము ప్రయత్నించడం లేదని చెప్పారు. పోలీసుల విచారణకు మధుకర్ అన్ని రకాలుగానూ సహకరిస్తారని అన్నారు. అయితే మధుకర్ లొంగిపోయిన విషయాన్ని ఇప్పటి వరకు పోలీసులు మాత్రం బయటకు వెల్లడించలేదు.
ఈ నెల 2వ తేదీన హథ్రస్ జిల్లాలోని ఫూల్రాయ్ గ్రామంలో సత్సంగ్ జరిగింది. ఆధ్యాత్మికవేత్త అయిన భోలే బాబా ప్రవచనం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు. అనంతరం భోలే బాబా పాదాలను తాకేందుకు భక్తులు ఎగబడ్డారు. దీంతో అక్కడ పెనుగులాట జరిగింది. తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 121 మంది మరణించారు. మరికొంత మంది తీవ్ర గాయాలై ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. అప్పటి నుంచి భోలే బాబా, ఆర్గనైజర్ మధుకర్‌లు పరారీలో ఉన్నారు. ఎట్టకేలకు ఇప్పుడు మధుకర్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.