arunachal pradesh : ఈశాన్య భారత దేశంలో ఉన్న రాష్ట్రాల్లో వరుసగా కొత్త జీవ జాతులు వెలుగు చూస్తున్నాయి. మొన్నామధ్య అక్కడో కొత్త చీమల జాతిని కనుగొన్నారు. మళ్లీ ఇప్పుడు తాజాగా ఓ కొత్త కప్ప జాతిని అక్కడ గుర్తించారు. అరుణాచల్ ప్రదేశ్( Arunachal pradesh) రాష్ట్రంలోని సుబాన్సిరి జిల్లాలో ఈ కొత్త కప్పను గుర్తించారు. తూర్పు హిమాలయాలకు సంబంధించిన జీవ జాతులకు అది నిలయం.
తొలుత ఇక్కడ గుర్తించిన కప్పను వియత్నాం, చైనా దేశాల్లో కనిపించే రకం కప్పగా శాస్త్రవేత్తలు భావించారు. దానిపై పరిశోధనలు చేయగా రెండింటికీ జన్యు పరంగా చాలా తేడా ఉంది. దీంతో కొత్త కప్ప జాతిని గుర్తించినట్లుగా వారు వెల్లడించారు. ఈ కొత్త కప్పకు(New frog) జెనోఫ్రిస్ అపాటానిగా నామకరణం చేశారు. దీనికి మిగిలిన కప్పలకంటే భిన్నంగా తలపైన రెండు కొమ్ముల్లాంటి నిర్మాణాలు ఉన్నాయి.
మేఘాలయాలోని షిల్లాంగ్‌కు చెందిన భాస్కర్ సైకా, విక్రమ్జీ సిన్హాల నేతృత్వంలో ఈ పరిశోధనలు జరిగాయి. తొలుత ఈ కప్పను 2019లోనే గుర్తించారు. అయితే అప్పుడు దీన్ని చైనా, వియత్నాంల్లో కనిపించే జోనోఫ్రిస్ మాసోనెన్సిన్ అనే రకం కప్పగా భావించారు. డాటాను అలాగే భద్రపరిచారు. అయితే ఇప్పుడు దాని జెనిటిక్ డాటాను, పరమాణు క్రమాన్ని నిశితంగా పరీక్షించారు. దీంతో ఈ రెండు కప్పలకు మధ్య చాలా తేడాలు ఉన్నట్లు గుర్తించారు. ఇదో కొత్త కప్ప జాతి(New frog species) అని ప్రకటించారు.