AP TDP chief : టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ యాదవ్ పేరును చంద్రబాబు ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుత అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో కొత్త అధ్యక్షుడిని నియమించాలని చంద్రబాబు నిర్ణయించారు. గాజువాక నుంచి 95వేలకు పైగా ఓట్ల మెజార్టీతో మంత్రి గుడివాడ అమర్నాథ్పై పల్లా శ్రీనివాసరావు ఘన విజయం సాధించారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి వంగలపూడి అనితకు హోంమంద్రి పదవి దక్కింది. సీనియర్లు ఎవరికీ అవకాశం దక్కలేదు. అందుకే పల్లాకు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
కొత్త అధ్యక్షుడిగా అయ్యన్న పాత్రుడితో పాటు మరికొంత మంది పేర్లను కూడా చంద్రబాబు పరిశీలించారు. అయితే యువకుడు అయిన పల్లా శ్రీనివాస్ యాదవ్ అయితేనే పార్టీ ఉత్సాహంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆయనను సెలక్ట్ చేశారు. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా సరే.. పార్టీని పట్టించుకోవడం లేదని.. అందుకనే అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తోందంటున్నారు. ఈసారి అలాంటి సమస్య రాకుండా.. పార్టీకి ప్రభుత్వానికి మధ్య పూర్తి స్థాయిలో సమన్వయం ఉండేలా .. పల్లా శ్రీనివాస్ యాదవ్ ను నియమిస్తున్నారు. పల్లా శ్రీనివాసరావు 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత టీడీపీలో చేరి 2014లో గాజువాక ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీనివాస్ యాదవ్ కూడా పలు వేధింపులు ఎదుర్కొన్నారు. ఆయన ఆస్తులపై దాడులు చేశారు. ఓ భవనాన్ని రాత్రికి రాత్రి కూలగొట్టారు.