Pawan Kalyan : వైపీసీపై కక్ష సాధింపులు ఉండబోవన్న పవన్.. నేడు బాబుతో కలిసి దిల్లీకి
జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ చేసిన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన బాధ్యతను గుర్తు చేసుకున్నారు. వైసీపీ, జగన్‌ల మీదా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే..?
Pawan Kalyan : పోటీ చేసిన అన్ని చోట్లా 100 శాతం విజయాలు దక్కించుకోవడం సాధారణమైన విషయం కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని చోట్లా జనసేన పార్టీ(janasena) గెలుపొందిన నేపథ్యంలో ఆయన మాట్లాడారు. తన మనసులోని భావాలను వెల్లడించారు. అయితే ఈ విజయాలతో తనకు అహంకారం కలగలేదని, విజయాలను బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. తమ కూటమి అద్భుత విజయంతో ఐదు కోట్ల మంది ప్రజల ఆంకాంక్షలను నెరవేర్చాల్సిన పెద్ద బాధ్యత తమపై ఉందని తెలిపారు.
వైసీపీ గురించి మాట్లాడుతూ… తాము అధికారాన్ని కక్ష సాధింపుల కోసం వాడుకోమని చెప్పారు. ఎవరిపైనా కక్షలు తీర్చుకోవడానికో, రాజకీయ శత్రువులను ఇబ్బంది పెట్టడానికో అధికారాన్ని తాము వాడుకోబోమని హామీ ఇచ్చారు. అలాగే జగన్(jagan) మీద తనకు ఎప్పటికీ వ్యక్తిగతంగా ద్వేషం ఉండబోదన్నారు. ప్రజాస్వామ్యాన్ని తాము పూర్తిగా గౌరవిస్తామని చెప్పారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా నలిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకనే ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆంకాంక్షలను నెరవేర్చే విధంగా తాము పని చేస్తామని చెప్పారు.
సామాన్య ప్రజల వేదనలు, యాతనలను ఎవరూ తీర్చలేరా? అనే ప్రశ్నే తనను రాజకీయాల్లోకి తీసుకు వచ్చిందని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వెల్లడించారు. ఫలితాల అనంతరం బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో పవన్, చంద్ర బాబులు నేడు దిల్లీకి పయనం అయ్యారు. అక్కడ బీజేపీ అగ్ర నాయకులతో చర్చలు జరిపి జూన్ 9 నాటికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నారు.