జట్టు ఎక్కువగా రాలే సమస్య చాలా మందిని వేదిస్తుంటుంది. అలాంటి వారు కొన్ని ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా దాన్ని అరికట్టుకోవచ్చు. ఆ ఆహారాలు ఏమిటంటే..?
Hair Growth Foods : ఇటీవల కాలంలో జుట్టు ఎక్కువగా రాలిపోవడం అనే సమస్యను చాలా మంది ఫేస్ చేస్తున్నారు. రకరకాల షాంపూలు, నూనెలు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే వీటి కంటే ముందు జుట్టు (HAIR)ఆరోగ్యకరంగా ఉండేందుకు ఏం తినాలన్న విషయాన్ని మాత్రం ఆలోచించరు. ఈ విషయంపై మనం అవగాహనతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఐరన్, జింక్, సెలీనియం, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని(FOODS) తీసుకోవాలి. అలాగే ఐరన్ లోపం లేకుండా చూసుకోవాలి. అందుకోసం కొత్తీమీర, పుదీనా, తోటకూర, కరివేపాకు, మునగాకు లాంటి ఆకు కూరల్ని ఎక్కువగా తినాలి. లేదంటే వీటిని పొడి చేసుకుని పెట్టుకుని కూరల్లో చల్లుకోవాలి. కరివేపాకు కారం లాంటివి తరచుగా తింటూ ఉండాలి.
జుట్టు ఆరోగ్యంగా, నిగారింపుతో పెరగాలంటే ప్రొటీన్లు సైతం సరిపడేంతగా ఆహారంలో ఉండాలి. అందుకోసం గుడ్లు, చికెన్, బీన్స్, నట్స్ లాంటి వాటిని తరచుగా తింటూ ఉండాలి. అలాగే కొవ్వులు తక్కువగా ఉండే పాలు, పాల పదార్థాలైన పనీర్, పెరుగు లాంటి వాటిని సైతం తింటూ ఉండాలి. మన శరీర రోజు వారీ అవసరాలకు సరిపోయేంత ప్రొటీన్‌ని తినేలా ప్లాన్ చేసుకోవాలి. అందువల్ల జుట్టు, గోళ్లతో పాటు మనం కూడా బలంగా ఉండగలుగుతాం. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే గింజలు, చేపల్లాంటి వాటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. అలాగే మొలకలు, వెజిటెబుల్ సలాడ్లలాంటి వాటిని తరచుగా తింటూ ఉండటం వల్ల జుట్టు రాలే(HAIR FALL) సమస్యలు బాగా తగ్గుతాయి.