Monsoon : చల్లని వార్త.. కేరళను తాకిన నైరుతీ రుతు పవనాలు!
రోహిణీ కార్తె ఎండలతో సతమతం అవుతున్న ప్రజలకు చల్లని వార్త వచ్చింది. నైరుతీ రుతుపవనాలు అనుకున్న దానికంటే ఒక రోజు ముందుగానే నేడు కేరళను తాకాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Southwest Monsoon : ఎండల నుంచి స్వాంతన లభించే మంచి గుడ్ న్యూస్ వచ్చింది. నైరుతీ రుతుపవనాలు అనుకున్న దానికంటే ఒక రోజు ముందుగానే కేరళను( kerala) తాకాయి. మరో మూడు, నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తాయని గురువారం భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. అనుకున్న దానికంటే ముందుగానే రుతుపవనాలు కదలడానికి రెమాల్ తుపాను కూడా ఒక కారణం అని ఐఎండీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మునుపటి వార్తల ప్రకారం చూసుకున్నట్లైతే ఈ ఏడాది మే 31న రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ(IMD) వెల్లడించింది. అయితే తుపాను కారణంగా వీటి కదలికలు వేగవంతం అయి ఒక రోజు ముందుగానే అవి భారత ప్రధాన భూభాగాన్ని తాకాయి. ఈ ఏడాది లానినా సైతం ఉండటంతో వర్షాలు అధికంగా పడే అవకాశాలు ఉన్నాయి.
లానినా ప్రభావం, భూమధ్య రేఖ వద్ద పసిఫిక్ మహా సముద్రం చల్లబడటం లాంటి వాటి ప్రభావం మన దేశంపై ఆగస్టు నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో ఉంటుంది. ఫలితంగా రుతుపవనాల కాలంలో సాధారణంగా కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయి. ఈశాన్య, తూర్పు, వాయువ్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్లా సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు పడతాయని ఐఎండీ(IMD) తెలిపింది. అందుకు అనుగుణంగా రైతులు పంటలను వేసుకోవాలని సూచించింది.