CEO Vikas Raj : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ రోజైన మే 13న ఓటు వేయాల్సిన బాధ్యతను మరువవద్దని రాష్ట్ర ఎన్నికల సీఈవో వికాస్ రాజ్ అన్నారు. శనివారం ఎస్ ఆర్ నగర్ లోని సీఈవో ఇంటికి వెళ్లి ఓటరు సమాచార స్లిప్ , పోలింగ్ తేదీ, ఓటరుగా గర్విస్తున్నాను అనే స్టిక్కర్ ను జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ వికాస్ రాజ్ కు అందజేశారు. ఈ సందర్భంగా సీఈవో వికాస్ రాజ్ మాట్లాడుతూ… ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు వేయాలన్నారు. ప్రజాస్వామ్య మనుగడకు, దేశ భవిష్యత్తుకు ఓటు ఆయుధం లాంటిదని అన్నారు. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలను ప్రజాస్వామ్య పండుగగా భావించాలన్నారు. ఎపిక్ కార్డు ఉంటే సరిపోదని, ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో పరిశీలించాలన్నారు.
ఈ సందర్భంగా ఓటరు నిద్ర, స్టిక్కర్ల పంపిణీ వివరాలను కమిషనర్ సీఈవోకు వివరించారు. బీఎల్ ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటరు సమాచార స్లిప్పులు, స్టిక్కర్లు పంపిణీ చేస్తున్నారని, గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ శాతం స్లిప్పులు పంపిణీ చేయనున్నామని కమిషనర్ సీఈవోకు వివరించారు. అంతకుముందు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ డీజీపీ రవిగుప్తా ఇంటికి వెళ్లి ఓటర్ స్లిప్, స్టిక్కర్ అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నామని, ఈనెల 13న జరిగే ఓటింగ్‌కు సిద్ధమయ్యామని, ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని డీజీపీ అన్నారు.