Artificial Intelligence: AI that can sense heart responses
Artifical Intelligence: కృత్రిమ మేధ(ఏఐ)తో గుండె కొట్టుకునే రేటులో మార్పులను అంచనా వేసే వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇది దాదాపు అరగంట ముందు పసిగడుతుంది. హృదయ స్పందన సాధారణ స్థాయి నుంచి ఏట్రియల్ ఫిబ్రిలేషన్‌కు మారే దశను ఏఐ నమూనా 80 శాతం కచ్చితత్వంతో గుర్తిస్తుంది. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది చాలా సర్వసాధారణంగా కనిపించే కార్డియాక్ అరిత్మియా. ఇందులో గుండె ఎగువ గదులు కొట్టుకునే రేటు హచ్చుతగ్గులకు లోనవుతుంది. దిగువ గదులతో దీనికి లయ తప్పుతుంది. ఇలాంటి సందర్భాల్లో తమ ఏఐ నమూనా ముందస్తు హెచ్చరికలు చేస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు.
దీనివల్ల బాధితులు నివారణ చర్యలు తీసుకుని, హృదయ స్పందనను స్థిరంగా ఉంచుకోవడానికి వీలవుతుంది. ఏఐ వ్యవస్థ తయారీ కోసం చైనాలోని వుహాన్‌లో ఉన్న టోంగ్జి ఆసుపత్రిలో 350 మంది రోగుల నుంచి 24 గంటల పాటు డేటాను శాస్త్రవేత్తలు సేకరించారు. దీని ఆధారంగా ఏఐ నమూనాకు శిక్షణ ఇచ్చారు. దీనికి వార్న్ అని పేరు పెట్టారు. ఇది డీప్ లెర్నింగ్ ఆధారంగా రూపొందింది. పాత డేటాలోని నిర్దిష్ట పోకడలను ఆధారంగా చేసుకుని అంచనాలు వేయడం దీని ప్రత్యేకత. దీన్ని స్మార్ట్ఫోన్లలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది స్మార్ట్‌వాచ్‌లలో నమోదయ్యే డేటాను విశ్లేషిస్తుంది.