Boxer Vijender Singh: బాక్సర్ విజేందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఈరోజు పార్టీ నేతల సమక్షంలో విజేందర్ సింగ్ కండువా కప్పుకున్నారు. బాక్సింగ్‌లో భారత్ తరఫున తొలి ఒలింపిక్ పతకం సాధించారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు 2019లో కాంగ్రెస్‌లో చేరారు. ఆ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నుంచి హస్తం అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ నేత రమేశ్ బిధూరీ చేతిలో ఓడిపోయారు. గతేడాది భారత్ రెజ్లింగ్ సమాఖ్య బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేపట్టిన ఆందోళనకు విజేందర్ మద్దతిచ్చారు.
వాళ్లతోపాటు అతను ఆందోళనలో పాల్గొన్నారు. హర్యానాలో అత్యధిక రాజకీయ ప్రాబల్యం ఉన్న జాట్ వర్గానికి చెందిన విజేందర్కు ఈ ఎన్నికల్లోనూ టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ భావించింది. అయితే బీజేపీ ఎంపీ హేమామాలిని పోటీ చేస్తున్న మథుర స్థానం నుంచి బరిలోకి దించే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రజలు కోరుకుంటే ఎక్కడినుంచైనా సిద్ధమే అంటూ ఇటీవల ఆయన ట్వీట్ చేశారు. ఇంతలో అతను పార్టీ మారారు. బీజేపీ తరఫున ఆయన బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే ఏ స్థానం నుంచి అనేది ఇంకా స్పష్టత లేదు.