Late Night Sleep : రోజూ ఆలస్యంగా నిద్రపోతున్నారా? ఏం జరుగుతుందంటే?
మనం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం ఎంత అవసరమో సరైన నిద్ర కూడా అంతే. అయితే కొంత మంది ఏవో కారణాల వల్ల రోజూ చాలా ఆలస్యంగా నిద్రపోతూ ఉంటారు. అలా రోజూ చేయడం వల్ల చాలా అనర్థాలే ఉన్నాయి. అవేంటంటే...
Late Night Sleep Side Effects : ఇటీవల కాలంలో చాలా మందికి నిద్రకు సంబంధించిన సమస్యలు అధికంగా ఉంటున్నాయి. కొంత మందికి మంచం మీద వాలి పడుకున్నా నిద్ర పట్టడం లేదు. మరి కొందరేమో అర్ధరాత్రి వరకు సినిమాలు, ఫోన్లో వీడియోలు అంటూ కావాలనే ఆలస్యంగా పడుకుంటూ(LATE NIGHT SLEEP) ఉంటారు. ఇలా తరచుగా జరగడం వల్ల మన శరీరంలో కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుని తొందరగా నిద్ర పోయేందుకు ప్రయత్నిద్దాం.
మనకు రాత్రికాగానే నిద్ర వస్తుంది. వెలుగు రాగానే మెలకువ వస్తుంది. ఇది సరిగ్గా పని చేయడాన్నే సిర్కాడియన్ రిథమ్ అంటారు. అయితే మనం కావాలనే రాత్రిళ్లు వెలుతురులో ఉండటం, టీవీలు, ఫోన్లు చూస్తూ ఉండటం వల్ల ఈ రిథమ్ గందరగోళానికి గురవుతుంది. నిద్ర హార్మోన్లు సరిగ్గా విడుదల కావు. దీంతో జీవ క్రియ మందగిస్తుంది. అలాగే దాదాపుగా ప్రతి రోజూ ఆలస్యంగా నిద్రపోయే వారిలో(LATE NIGHT SLEEP) మెదడుకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. ఏకాగ్రత లేకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మానసికంగా చురుగ్గా లేకపోవడం లాంటివి జరుగుతాయి.
అర్ధరాత్రి నిద్రకు(MIDNIGHT SLEEP) ఉపక్రమించే వారిలో ఒత్తిడి హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీని వల్ల ఆందోళన పెరుగుతుంది. స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఓ రకంగా బరువు పెరగడానికీ ఇది కారణం అవుతుంది. రాత్రి 12 గంటల తర్వాత నిద్రపోయే వారిలో ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక నిద్రలేమి సమస్యలు పెరుగుతాయి. తొందరగా నిద్రపోవడం, తొందరగా లేవడం అనేది మన మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతగానో సహకరిస్తుంది. కాబట్టి ఈ విషయంలో అంతా తప్పక దృష్టి సారించాలి.