»Oscars Audience Laughs At Jimmy Kimmels Response To Donald Trump
Donald trump : ఆస్కార్ వేదికగా అబాసుపాలైన ట్రంప్!
తన నోటి దురుసుదనంతో కొన్నిసార్లు వార్తల్లో నిలుస్తుంటారు డొనాల్డ్ ట్రంప్. ఈ సారి దానితోనే ఆయన ఆస్కార్ వేదిక సాక్షిగా నవ్వులపాలయ్యారు. వివరాల్లోకి వెళితే...
Donald trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నోటి దురుసు కారణంగా ఆస్కార్ వేదికగా నవ్వులపాలయ్యారు. ఆస్కార్ అవార్డులకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న జిమ్మి కిమ్మెల్పై(Jimmy Kimmel) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘమైన పోస్ట్‌ని రాసి సోషల్ మీడియా వేదిక ట్రూత్‌లో పోస్ట్ చేశారు. ఆ వ్యాఖ్యలకు ఒళ్లు మండిన జిమ్మి ఆస్కార్ వేదికపై అనూహ్యంగా స్పందించారు.
ఆస్కార్ వేడుకలు జరుగుతున్న సమయంలో ట్రంప్(Trump) ఈ పోస్ట్ పెట్టారు. ఆస్కార్ వేడుకల్లో జిమ్మీని మించిన చెత్త హోస్ట్ ఎవరూ లేరన్నారు. సాధారణ స్థాయి కంటే తక్కువ వ్యక్తి తనకు సాధ్యం కాని దాన్ని ప్రయత్నిస్తున్నట్లుగా ఉందన్నారు. అది ఎప్పటికీ జరగకూడదన్నారు. ముందు అతన్ని తొలగించి మరో తక్కువ పారితోషికం తీసుకునే వ్యక్తిని భర్తీ చేయండి అతను ఇంతకంటే మెరుగ్గా చేయగలడన్నారు. చివరికి బ్లా.. బ్లా… బ్లా… అంటూ రాసి పోస్ట్ చేశారు.
ట్రంప్ ఈ విధంగా పోస్ట్ పెడితే.. దీనికి గంటలోనే జిమ్మీ నుంచి దిమ్మ తిరిగిపోయే ప్రతిస్పందన వచ్చింది. ఆస్కార్( Oscar) వేదికపై స్వయంగా జిమ్మీ దీని గురించి ప్రస్తావించారు. ఇప్పుడే తన పని తీరుపై ఓ రివ్యూ అందిందని జిమ్మీ అన్నారు. ఆ పోస్ట్ మొత్తాన్ని ఆస్కార్ వేదికపై చదివారు. అమెరికా ఏ మాజీ అధ్యక్షుడు ఈ పోస్ట్ చేశారో అతిథులు ఊహించాలని అన్నారు. ‘మీ జైలు గడువు ఇంకా ముగియలేదా? ’ అంటూ ఎద్దేవా చేశారు. దీంతో అక్కడున్న ఆడియన్స్ అంతా ఘల్లుమన్నారు.