Menopause : మెనోపాజ్‌లో బరువు పెరుగుతున్నారా? తగ్గండిలా!
నలభైలు పైబడిన స్త్రీల్లో మెనోపాజ్ దశ ఉంటుంది. అప్పుడు సాధారణంగా అంతా బరువు పెరుగుతుంటారు. మరి దీన్ని తగ్గించుకోవడం ఎలాగో, ఎలాంటి అలవాట్లు చేసుకోవాలో తెలుసుకుందాం రండి.
నలభై, నలభై అయిదేళ్లు దాటిని స్త్రీలలో మెనోపాజ్ వల్ల శరీరంలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి. రుతుక్రమం ఆగిపోవడానికి ముందు శరీరం తనని తాను సిద్ధం చేసుకుంటుంది. దీనిలో భాగంగానే ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది. అందువల్ల శరీరంలో కొవ్వులు పేరుకుపోయి బరువు పెరిగే(weight gain) అవకాశాలు పెరుగుతాయి. అందుకనే చాలా మంది ఈ సమయంలో బరువు పెరుగుతుంటారు. కొన్ని అలవాట్లు మార్చుకోవడం ద్వారా ఈ సమయంలో తేలికగా బరువు తగ్గొచ్చు.
ఈ ఆహారాలు తినాలి : మెనోపాజ్‌లో(Menopause) స్త్రీల శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలు బాగా తగ్గిపోతాయి. ఇందుకు ప్రత్యామ్నాయంగా బయట నుంచి ఫైటో ఈస్ట్రోజన్ని తీసుకోవాలి. సోయా బీన్స్, నువ్వులు, అవిసెలు, వెల్లుల్లి, పీచ్‌లు, బెర్రీలు , గోధుమ పొట్టు(తవుడు), బ్రోకలీ, క్యాబేజ్, డ్రైఫ్రూట్స్… తదితర ఆహార పదార్థాల నుంచి పుష్కలంగా లభిస్తుంది. వీటితోపాటు చిక్కుళ్లు, చేపలు, తక్కువ కొవ్వులు ఉండే పాల ఉత్పత్తులను తీసుకోవడం మంచిది. అలాగే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తగ్గించాలి. బదులుగా ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాలి. ఆహారంలో పీచు పదార్థం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. తాజా పళ్లు, కూరగాయలు తీసుకోవాలి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల ఈ సమయంలో శరీరం లోపల వచ్చే వాపుల నుంచి రక్షణ పొందవచ్చు.
క్రమం తప్పకుండా వ్యాయామం : మెనోపాజ్‌లో ఉన్న స్త్రీలు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా, బరువును నియంత్రించుకోవాలన్నా ప్రత్యేకంగా శ్రద్ధ చూపాల్సిందే. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడంతోపాటు రోజూ కచ్చితంగా శారీరక శ్రమను పెంచాలి. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండటం వల్ల శరీర యాక్టివిటీని పెంచాలి. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలి. అరోబిక్స్ కూడా బాగా సహాయ పడుతుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.