Drishyam Hollywood remake : మన దేశంలో విడుదలైన అన్ని భాషల్లోనూ దృశ్యం సిరీస్ సినిమాలు ఘన విజయం సాధించాయి. మలయాళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. అయితే ఇప్పుడు దృశ్యం సినిమాను హాలీవుడ్లో రీమేక్ చేయబోతున్నారు. ఈ మేరకు ఓ హాలీవుడ్ నిర్మాణ సంస్థ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది. ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఈ సినిమాని రీమేక్ చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో హాలీవుడ్లో రీమేక్ అవుతున్న తొలి భారతీయ చిత్రంగా ‘దృశ్యం’(Drishyam) సినిమా నిలవనుంది.
మొదట మలయాళంలో ఈ సినిమా తెరకెక్కింది. అక్కడ విజయవంతం కావడంతో హిందీలో దృశ్యం పేరుతో, కన్నడలో దశ్య పేరుతో, తమిళ్లో పాపనాశం పేరుతో, తెలుగులో దృశ్యం పేరుతో రీమేక్ చేసి విడుదల చేశారు. దానికి సీక్వెల్గా వచ్చిన దృశ్యం 2 కూడా విజయవంతం అయ్యింది. దీంతో ఈ సిరీస్ సినిమాలను మొదట కొరియన్లో రీమేక్ చేశారు. అవి అక్కడా భారీ విజయాన్ని సంపాదించుకున్నాయి.
ఇన్ని విజయాలతో ఇప్పుడు దృశ్యం(Drishyam) సినిమాపై హాలీవుడ్ నిర్మాతల దృష్టి పడింది. హాలీవుడ్లో ప్రసిద్ధి చెందిన గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్, మరో నిర్మాణ సంస్థతో కలిసి ఈ సినిమాను ఆంగ్లం, స్పానిష్ల్లో రీమేక్ చేయనుంది. భారతీయ సినిమా నిర్మాణ సంస్థ పనోరమ స్టూడియోస్ నుంచి ఈ చిత్రాల అంతర్జాతీయ రీమేక్ హక్కులను ఆ సంస్థ సొంతం చేసుకుంది.