ఇంగ్లాండ్ (England) లోని ఓ హాస్పిటల్లో దారుణం చొటు చేసుకుంది. కనికరం లేకుండా ఓ నర్సు దారుణానికి ఒడిగట్టింది. ఏడుగురి నవజాత శిశువులని హత్య చేసింది. అంతేకాకుండా మరో ఆరుగురిని చంపేందుకు విఫలయత్నం చేసింది.అయితే, ఈ కేసుల్లో తాను అమాయకురాలినంటూ వాదిస్తూ వచ్చిన ఆమె.. చివరకు సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టులో దోషిగా తేలింది. బ్రిటన్(Britain)లో ఈ దారుణం వెలుగుచూసింది. లూసీ లెట్బీ (Lucy Letby) (33) అనే మహిళ 2015- 16 మధ్య కాలంలో ఇంగ్లాండ్‌లోని ఓ హాస్పిటల్లో నర్సు (nurse)గా విధులు నిర్వహించింది.
ఆ సమయంలో ఆస్పత్రిలో ఎటువంటి స్పష్టమైన కారణాలు లేకుండా, ఆకస్మికంగా ఆరోగ్యం విషమించి పలువురు శిశువులు మృతి చెందారు. మరికొందరి ఆరోగ్యం(Health) క్షీణించినా.. సకాలంలో వైద్యం అందించడంతో కోలుకున్నారు. ఈ అన్ని కేసుల్లోనూ ఆస్పత్రి నవజాత శిశువుల వార్డులో లూసీ లెట్బీ విధుల్లో ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలోనే శిశుమరణాలపై 2017 మే నెలలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులకు సంబంధించి ఆమెను మూడు సార్లు అరెస్టు చేశారు. ఏడుగురు శిశువుల హత్య, మరో పది మందిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు ఆమెపై అభియోగాలు మోపారు. ఖాళీ ఇంజెక్షన్లు ఎక్కించి, ట్యూబ్‌ల సాయంతో పొట్టలోకి గాలి లేదా పాలు పంపించి, ఆక్సిజన్ ట్యూబ్(Oxygen tube)లకు ఆటంకం కలిగించి, ఇన్సులిన్ ఎక్కించి ఇలా ఉద్దేశపూర్వకంగా శిశువులకు హాని కలిగించినట్లు పేర్కొన్నారు.
పోలీసుల దర్యాప్తు క్రమంలో.. ‘నేను చెడ్డదాన్ని. నేనే ఇలా చేశాను. వారిని ఉద్దేశపూర్వకంగా చంపాను. ఎందుకంటే నేను వారిని చూసుకునేంత మంచిదాన్ని కాదు’ అని రాసి ఉన్న పేపర్లు ఆమె ఇంట్లో లభ్యమయ్యాయి. ఈ క్రమంలోనే గతేడాది అక్టోబరులో కోర్టు విచారణ మొదలైంది. అయితే, లెట్బీ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. నవజాత శిశువు(newborn baby)ల వార్డులో లోపాలను కప్పిపుచ్చేందుకే అక్కడి సీనియర్ వైద్యులు తనపై నిందలు మోపారని ఆమె తరఫు లాయర్ (Lawyer) వాదించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఇటీవల విచారణ పూర్తి చేసింది. ఆమెను దోషి(guilty)గా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించింది. శిక్ష ఖరారు చేయాల్సి ఉంది.