ఎప్పుడు బిజీబిజీగా వుండే మంత్రి కేటీఆర్ (Minister KTR) ఇవాళ సొంత నియోజకవర్గంలో కొద్దిసేపు సరదాగా గడిపారు. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో సిరిసిల్లలోని మిడుమానేరులో బోటింగ్ యూనిట్ ఏర్పాటుచేసారు. ఈ యూనిట్ ను పర్యాటక మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) తో కలిసి ప్రారంభించిన కేటీఆర్ బోటింగ్ ను మరింత ఆస్వాదించేందుకు స్వయంగా స్టీరింగ్ పట్టారు . ఇలా కొద్దిసేపు బోట్ (boat) ను నడుపుతూ చుట్టుపక్కల ప్రకృతి అందాలను మంత్రి వీక్షించారు. పర్యాటకులను ఆకర్షించేందుకు మిడ్ మానేరు జలాశయం వద్ద బోటింగ్ సౌకర్యాన్ని ఏర్పాటుచేసినట్లు ఆయన వెల్లడించారు.
ఇక్కడ నీటిలో ప్రయాణిస్తూ చుట్టూవున్న అందాలను వీక్షిస్తూ బోటింగ్ చేయవచ్చని తెలిపారు. 120 మంది ఒకేసారి ప్రయాణించేలా డబుల్ డెక్కర్ (Double decker) ఏసి క్రూయిజ్, 20 మంది ప్రయాణించేలా అమెరికన్ ప్లాటూన్ డీలక్స్, నలుగురు ప్రయాణించేలా స్పీడ్ బోట్స్ అందుబాటులో వుంటాయని అన్నారు. కాగా, ప్రారంభోత్సవం అనంతరం, మంత్రి ఓ బోటులో ప్రయాణిస్తూ స్టీరింగ్ ను తన చేతుల్లోకి తీసుకున్నారు. బోటును నడుపుతూ ఆస్వాదించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది.