మిడతల (locusts) దండు దాడి చేసిందంటే ఆపంట పొలం పంట నిమిషాల్లో నాశనం అయినట్టే. మిడతల దండు క్రాప్పై విరుచుకు పడుతుండటంతో రైతులు (Farmers) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎడారులకు దగ్గరగా ఉన్న రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో పంటలకు మిడతల బెడద ఎక్కువ. అయితే, అప్పుడప్పుడూ తెలంగాణ (Telangana) వంటి ఇతర రాష్ట్రాల్లోనూ మిడతల దండు పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. మిడతలు రెండేళ్ల క్రితమే భారత్ ను వణికించింది. పంట పొలాలను నిలువునా ధ్వంసం చేసేశాయి. తాజాగా మరోసారి మిడతల దండు ముప్పు భారత్ కు పొంచి ఉంది. మిడతల నియంత్రణ బృందం ఇప్పటికే ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. రాజస్థాన్ (Rajasthan) సరిహద్దు ప్రాంతాల్లో మిడతల గుడ్లు భారీ మొత్తంలో సర్వే బృందం సభ్యులు కనుగొన్నారు. ఇప్పటికే గుడ్ల నుంచి మిడతలు బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు గుర్తించారు.
రోజురోజుకూ మిడతల సంఖ్య పెరుగుతూ, పంట పొలాలకు ప్రమాదమనే సంకేతాలనిస్తున్నారు. ఈ పరిణామాలతో రైతులకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. కోట్లాది మిడతలు గుంపులుగా ఎగురుతూ సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తాయి. ఈ మార్గంలో ఉన్న పంటలను దెబ్బతీస్తాయి. అయితే తాజాగా రాజస్థాన్ సరిహద్దు ప్రాంతానికి మిడత గుడ్లు ఎలా చేరాయనే దానిపై మిడతల నియంత్రణ బృందం అధ్యయనం చేస్తోంది.ఈ ప్రాంతంలో కనిపించిన మిడత గుడ్లు పొరుగున ఉన్న పాకిస్తాన్ దేశం (Pakistan) నుంచి వచ్చి ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో మిడతలు భారత్ చేరుకోవడానికి దండుగా సుదూరం ప్రయాణం చేసి ఉంటాయని భావిస్తున్నారు. పాకిస్తాన్ కు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) ల మీదుగా చేరి ఉంటాయని తెలుస్తోంది.