»Students Attack Teacher For Asking For Tuition Fee
Video Viral: ట్యూషన్ ఫీజు అడిగినందుకు టీచర్‌పై కాల్పులు..!
ఇద్దరు విద్యార్థులు తమ ట్యూషన్ టీచర్ పై తుపాకీతో కాల్పులు జరిపారు. గత కొన్ని రోజులుగా పెండింగ్ ట్యూషన్ ఫీజును చెల్లించమంటూ టీచర్ అడగటంతో విద్యార్థులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రస్తుతం కాల్పులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రోడ్డుపై వెళ్తున్న తన పూర్వ విద్యార్థులను ఓ టీచర్ పలకరించాడు. విద్యార్థులు కూడా ఆ టీచర్‌ను ఎలా ఉన్నారని అడిగారు. ఇంతలో ఆ విద్యార్థులు ఒక్కసారిగా తుపాకీ తీసి ఆయన కాల్పులు జరిపి(Students Fire at Teacher) పారిపోయారు. మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది.
గిర్వార్ సింగ్ గత కొంతకాలంగా ఔరా రోడ్లో ట్యూషన్ సెంటర్(Tution Centre) నడుపుతున్నాడు. మూడేళ్ల క్రితం ఇద్దరు విద్యార్థులు 12వ తరగతి పరీక్షల కోసం ఆయన వద్దకు వచ్చి చదువుకున్నారు. ఆ తర్వాత ఆ ట్యూషన్ మాస్టర్‌కు కొంత ఫీజును చెల్లించలేదు. దీంతో ఆ టీచర్ తన పూర్వ విద్యార్థులు కనిపించినప్పుడల్లా పెండింగ్ ట్యూషన్ ఫీజు గురించి అడుగుతూ ఉండేవాడు. ఈ విషయంలో ఆగ్రహం చెందిన విద్యార్థులు టీచర్‌పై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు.
ఆ ఇద్దరు యువకులు నిన్న ట్యూషన్ సెంటర్(Tution Centre) వద్దకు బైక్‌పై వచ్చి తమ టీచర్ ను బయటకు రమ్మన్నారు. ట్యూషన్ యోగక్షేమాల గురించి ఆరా తీసిన తర్వాత మెల్లగా తమ వద్ద ఉన్న నాటు తుపాకీని తీసుకుని టీచర్ గిర్వార్ సింగ్ పై కాల్పులు జరిపారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టీచర్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరారైన విద్యార్థుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.