దేశంలోని 15 నగరాల్లో మెట్రో రైళ్లు (Metro Rails) ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. అయితే త్వరలో నీటి అడుగు భాగం నుంచి ప్రయాణించే మెట్రో రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్ట్ పనులు ఇప్పటికే పూర్తికావొచ్చాయి. డిసెంబర్లో తొలి అండర్ వాటర్ మెట్రో రైలు (Under Water Metro Rail) పరుగులు పెట్టనుంది. ఈ విషయాన్ని కోల్కతా మెట్రో రైల్ కార్పొరేషన్ (Kolkata Metro Rail Corporation) వెల్లడించింది.
అండర్ వాటర్ మెట్రో రైలు ప్రాజెక్ట్ పనులు చివరి దశలో ఉన్నాయని, పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నట్లుగా కేఎంఆర్సీ అధికారులు వెల్లడించారు. కోల్కతా లోని హుగ్లీ నది అడుగు భాగం నుంచి ఈ అండర్ వాటర్ మెట్రో మార్గాన్ని నిర్మిస్తున్నట్లు కేఎంఆర్సీ తెలిపింది. కోల్కతా నగరంలోని తూర్పు వైపు నుంచి పశ్చిమం వైపు ఈ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 16 కిలోమీటర్ల పొడవునా ఈ మెట్రో ట్రాక్ (Metro Track)ను నిర్మించారు.
ప్రస్తుతం 4.8 కిలోమీటర్ల దూరం మాత్రమే ట్రాక్ పూర్తయ్యింది. ఎస్ల్పానేడ్ నుంచి హౌరా స్టేడియం వరకూ ఈ అండర్ వాటర్ మెట్రో రైలును డిసెంబర్ నెలలో ప్రారంభించనున్నారు. ఈ రూట్ అందుబాటులోకి వస్తే ప్రతి 12 నిమిషాలకు ఒక మెట్రో ప్రయాణించనుందని కోల్కతా మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీవాత్సవ తెలిపారు. జూన్ 2024లో పూర్తిగా 16 కిలోమీటర్ల కారిడార్లో అండర్ వాటర్ మెట్రో సేవలు విస్తరించనున్నాయని వెల్లడించారు.