Tax Payers: సమయం లేదు మిత్రమా.. పన్ను చెల్లించేందుకు ఒక్కరోజు మాత్రమే!
రెండో విడత పన్ను చెల్లించేందుకు ఆర్థిక శాఖ సెప్టెంబర్ 15వ తేది వరకూ గడువు ఇచ్చింది. ఆ గడువు రేపటితో ముగియనుంది. ఒకవేళ ఎవరైనా గడువులోగా పన్ను చెల్లించకుంటే వారికి జరిమానాను విధించనున్నట్లు వెల్లడించింది.
2023-24 ఆర్థిక ఏడాదికి ముందస్తు పన్ను చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ముందస్తు పన్నును రెండో విడత ప్రజలు చెల్లిస్తూ వస్తున్నారు. అయితే ఈ ట్యాక్స్ రెండవ విడత చెల్లించడానికి ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది. రెండో విడత పన్ను చెల్లించడం సెప్టెంబర్ 15వ తేదితో ముగియనుంది. ఒక వేళ ఎవరైనా ఈ గడువులోగా పన్ను చెల్లించకుంటే సెక్షన్ 234B, 243C కింద జరిమానా విధించే అవకాశం ఉంది.
Kind Attention Taxpayers!
The due date for payment of the second instalment of Advance Tax is almost here!
Do remember to pay your second instalment of Advance Tax by 15th September, 2023. pic.twitter.com/rOOzXnWmwe
పన్నును చెల్లించేందుకు మొత్తం నాలుగు వాయిదాలు ఉంటాయి. మొత్తం పన్నులో మొదటి విడత 15 శాతం జూన్ 15వ తేదిలోగా చెల్లించాల్సి ఉంది. రెండో విడత 45 శాతం సెప్టెంబర్ 15వ తేదిలోగా చెల్లించాలి. అందులో జూన్ వాయిదా కూడా కలిపి ఉంటుంది. డిసెంబర్ 15వ తేదికి 75 శాతం చెల్లించాలి. ఆ తర్వాత 100 శాతం పన్నును మార్చి 15వ తేదిలోపు చెల్లించాల్సి ఉంటుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను బాధ్యత రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వేతన ఉద్యోగులు లేదా ఏ రకమైన వ్యాపారవేత్త అయినా ముందస్తు పన్ను చెల్లించాలని కేంద్రం వెల్లడించింది. అంతేకాకుండా జీతంతో పాటుగా ఇతర ఆదాయ వనరులు ఉన్నవారు కూడా ఈ పన్నును చెల్లించాలని, అందులోనే అద్దె, మూలధన లాభాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా లాటరీ ద్వారా గెలిచిన ఆదాయం ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.
ఇందులో వ్యాపారం లేదా ఏదైనా వృత్తి నుంచి ఆదాయం రాని సీనియర్ సిటిజన్లు అంటే 60 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సున్న వారు ముందస్తు పన్నును చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. ముందస్తు పన్ను ఏదైనా వాయిదా చెల్లించడంలో డీఫాల్ట్ అయితే పన్ను చెల్లింపుదారులపై జరిమానా విధించే అవకాశం ఉంది. కాబట్టి రేపటిలోగా రెండో విడత పన్నును చెల్లించకుంటే వెంటనే చెల్లించాలని ఆర్థిక శాఖ కోరుతోంది.