దాదాపు రూ.1000 కోట్లకు సంబంధించిన ఆన్లైన్ పాంజీ స్కామ్ విచారణలో పోలీసులు బాలీవుడ్ నటుడు గోవిందాను ప్రశ్నించనున్నారు. ఒడిశాకు చెందిన ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఆయన్ని విచారించనుంది. సోలార్ టెక్నో అలియనెస్స్ అనేది ఆన్లైన్ ద్వారా భారీ స్కామ్ చేసింది. క్రిప్టో పెట్టుబడుల పేరుతో ఈ సంస్థ వివిధ మోసాలకు పాల్పడింది. ఈ ఆన్లైన్ పాంజీ స్కామ్ విచారణంలో నటుడు గోవిందాను కూడా ఈఓడబ్ల్యూ ప్రశ్నించనుంది.
ఆ కంపెనీకి చెందిన కొన్ని ప్రమోషనల్ వీడియోల్లో నటుడు గోవిందా ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. ముంబైలో ఉన్న గోవిందాను ప్రశ్నించేందుకు అక్కడికి ఓ టీమ్‌ను పంపనున్నట్లు ఈఓడబ్ల్యూ ఇన్స్పెక్టర్ జనరల్ జేఎన్ పంకజ్ వెల్లడించారు. ఈ కేసులో గోవిందా అనుమానితుడో లేకుంటే నిందితుడో కాదని, విచారణ తర్వాత కేసులో ఆయన పాత్ర ఏంటో తెలుస్తుందని పోలీసు ఆఫీసర్ పంకజ్ తెలిపారు.
భద్రక్, కీన్‌జర్, బాలాసోర్, మయూర్బంజ్, భువనేశ్వర్ ప్రాంతాలకు చెందిన సుమారు పదివేల మంది నుంచి రూ.30 కోట్లను వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బీహార్, యూపీ, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, జార్ఖండ్, ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లోని డిపాజిటర్ల నుంచి లక్షల మొత్తంలో సోలార్ టెక్నో అలియనెస్స్ కంపెనీ తీసుకుంది. ఈ కంపెనీకి అధిపతిగా ఉన్న గుర్జీత్ సింగ్ సిద్ధూ, నిరోద్ దాస్‌లను ఆర్థికశాఖ అధికారులు అరెస్ట్ చేశారు.