వచ్చే ఐదేళ్లలో 50 శాటిలైట్లను ప్రయోగించనున్నట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. మరిన్ని ప్రయోగాలను 2024లో చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన ఇస్రో మరిన్ని లక్ష్యాలతో దూసుకుపోనుంది. 2023లో ఇస్రో అనేక ప్రాజెక్టులు చేపట్టిన సంగతి తెలిసిందే. చంద్రయాన్3, ఆదిత్య ఎల్1 వంటి వాటిని విజయవంతంగా ప్రయోగించింది. అవే కాకుండా ఇంటెలిజెన్స్ కు సంబంధించిన శాటిలైట్లపై కూడా దృష్టి పెట్టింది. జియో ఇంటెలిజెన్స్ కోసం వచ్చే ఐదేళ్లలో 50 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించేందుకు సిద్ధమైంది.
రాబోవు ఐదు ఏళ్లలో 50 ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఇండియా ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. అంతరిక్షంలోని పలు కక్ష్యల్లో శాటిలైట్ల లేయర్లను క్రియేట్ చేసి వాటి ద్వారా వేలాది కిలోమీటర్ల దూరంలోని సైనికుల కదలికలను పసిగట్టేలా ప్రయోగాలను ఇస్రో చేపట్టనున్నట్లు సోమనాథ్ వివరించారు.
భారత్ ను శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రస్తుతం ఉన్న జియో ఇంటెలిజెన్స్ సరిపోదని, ఇప్పుడున్న దానికంటే పది రెట్ల సామర్థ్యంతో పనిచేసే జియో ఇంటెలిజెన్స్ అవసరం అని ఎస్. సోమనాథ్ తెలిపారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బాంబేలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సోమనాథ్ ఆ విషయాలను వెల్లడించారు.