రైల్వే శాఖ(Railway) కొత్త నియమాన్ని జారీ చేసింది. ఇప్పటి వరకు జంతు ప్రేమికులు(Animal Lovers) తమ పెంపుడు జంతువులను తమతో పాటు తీసుకువెళ్లేవారు. అయితే, అలా తీసుకువెళ్లాలంటే కొంత ఇబ్బంది కూడా ఉండేది. ఇతర ప్రయాణికులు అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం కూడా ఉండేది. అయితే, ఇక నుంచి అలాంటి అభ్యంతరాలు రాకుండా ఉండేలా ఐఆర్సీటీసీ(IRCTC) నిర్ణయం తీసుకుంది. ఎవరైనా తమ పెంపుడు జంతువుని తమతో పాటు రైల్లో తీసుకువెళ్లాలి అనుకుంటే.. వారు దానికి కూడా టికెట్ తీసుకుంటే సరిపోతుంది. టికెట్ తీసుకుంటే, ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉండదు కదా. అయితే, ఈ సదుపాయం ఇంకా అమలులోకి రాలేదు. త్వరలోనే తీసుకురావడానికి రైల్వే శాఖ(Railway) ప్రయత్నిస్తోంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించే ప్లాన్ చేస్తున్నారు. టీటీఈలకూ ఈ టిక్కెట్లను జారీ చేసే అధికారాన్ని ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే పెంపుడు జంతువులతో రైలు ప్రయాణాలు మరింత సులభతరం అవుతాయి.
ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీల్లో ప్రయాణించే వారికి తమ వెంట పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. ఇందు కోసం ముందుగా ప్రయాణికులు(Railway Passengers) స్టేషన్‌లోని పార్సిల్ కౌంటర్లో ఓ టిక్కెట్ కొనుగోలు చేయాలి. ఇక సెకండ్ క్లాస్ లగేజ్ లేదా బ్రేక్ వ్యాన్‌లో ఒక బాక్స్‌లో కూడా పెంపుడు జంతువులను తరలించవచ్చు. అయితే, ఇదంతా కాస్త కష్టతరంగా మారడంతో పెంపుడు జంతువులకు ఆన్లైన్ టికెట్ బుకింగ్(Online Ticket Booking) సదుపాయాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని రైల్వే శాఖ పరిశీలిస్తోంది. ఈ దిశగా ఐఆర్సీటీసీ(IRCTC) వెబ్సైట్లో మార్పులు చేయాలని రైల్వే శాఖ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్స్ సిస్టమ్స్‌కు సూచించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.