టైటిల్ చూడగానే మీరు కూడా నోరెళ్లబెట్టారా? మీరు నోరెళ్లబెట్టినా.. పెట్టకపోయినా ఇది నిజం. అక్షరాలా నిజం. మీరు పైన చూస్తున్న ఫోటోలో ఉన్న కుక్క గురించే మనం ఇప్పుడు మాట్లాడుకునేది. ఆ కుక్క పేరు టామీ. తనకు క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలని దరఖాస్తు కూడా చేసుకుంది. అసలు కుక్కకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఏంటి అంటారా? క్యాస్ట్ మాత్రమే కాదు.. తనకు ఇప్పటికే ఆధార్ కార్డు కూడా ఉంది. ఆధార్ కార్డులో తన పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్ కూడా ఉంది.
అసలు కుక్క క్యాస్ట్ సర్టిఫికెట్‌కు దరఖాస్తు ఎలా చేసుకుందని అధికారులకు ఎలా తెలిసిందో తెలుసా? ఇటీవల కులాల గణన కోసం బీహార్ ప్రభుత్వం ఒక సర్వే నిర్వహిస్తోంది. అందులో క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న కుక్క అప్లికేషన్ అధికారుల దగ్గరికి వచ్చింది. ఆ దరఖాస్తును చూసి అధికారులు షాక్ అయ్యారు.
ఆ దరఖాస్తు ఫామ్‌లో ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ, వృత్తి అన్నీ రాసి ఉన్నాయి. కానీ.. అది కుక్కకు చెందిన దరఖాస్తు అని తెలిసి అధికారులు ఆశ్చర్యపోయారు. ఆ దరఖాస్తుకు ఆధార్ కార్డు కూడా జత చేసి ఉంది. ఆధార్ కార్డులో టామీ అనే పేరు ఉంది. గయా జిల్లాలోని గురారు జోనల్ ఆఫీసులో ఈ ఘటన చోటు చేసుకుంది. అడ్రస్ కూడా అందులో ఉండటంతో అధికారులకు ఏం చేయాలో అర్థం కాలేదు.
దరఖాస్తు ఫామ్‌లో ఇచ్చిన ఫోన్ నెంబర్‌కు అధికారులు కాల్ చేసి చూడగా ట్రూకాలర్‌లో రాజాబాబు అనే పేరు వచ్చిందట. ఆధార్ కార్డు కూడా ఫేక్ అని, దరఖాస్తును ఎవరో ఆకతాయిలు కావాలని నింపి అధికారులకు పంపించారని, ఇలాంటి పనులు చేయడం చట్టరిత్యా నేరం అని, ఆ ఆకతాయిలను పట్టుకొని వారిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. జనవరి 7 నుంచి బీహార్‌లో కుల ఆధారిత సర్వే తొలి దశను ప్రారంభించారు.