AP TS Weather : తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు చిరు జల్లులు
ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఎక్కువ కావడం మొదలైంది. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో శని, ఆది వారాల్లో చెదురు మదురుగా జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
AP TS Weather : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో వాతావరణం ఇప్పుడిప్పుడే వేడెక్కడం మొదలైంది. అయితే ఈ తాపం నుంచి ఈ రెండు రోజులు కాస్త ఉపశమనం లభించే కబురు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు రోజుల పాటు తేలికపాటు జల్లులు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడున్నాయి చదివేయండి.
దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే దక్షిణ తెలంగాణలో మరో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తున ఏర్పడి ఉంది. ఇది రాయలసీమ మీదిగా దక్షిణ తమిళనాడు వరకు విస్తరించి ఉంది.
ఈ ఉపరితల ఆవర్తనాల ప్రభావం వల్ల తెలంగాణ(Telangana), ఏపీ(AP)ల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని అన్నారు. మరికొన్ని జిల్లాల్లో మంచు, పగటి పూట ఎండలు తీవ్రంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. నేటి నుంచి 26 వరకు తెలంగాణలో తేలికపాటి జల్లులు(Light Showers) పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అయితే ఎలాంటి వాతావరణ హెచ్చరికలు లేవని తెలిపారు. దక్షిణ తెలంగాణ పరిసరాల్లో తుపాను తరహా సర్కిలేషన్ ఏర్పడిందన్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల పైకి మేఘాలు విస్తరిస్తున్నాయని వర్షాలు పడే అవకాశం ఉంటుందని అన్నారు.