MP Raghurama : వైసీపీకి రాజీనామా చేసిన రఘురామ కృష్టం రాజు
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వైసీపీకి ఎట్టకేలకు రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సీఎం జగన్కు ఆయన లేఖ రాశారు.
MP Raghu Rama Krishnam Raju Resigns : గత కొంత కాలంలో వైసీపీలోనే ఉంటూ రెబల్ ఎంపీగా కొనసాగుతున్న రఘు రామ కృష్ణం రాజు( Raghurama Krishnam Raju) ఎట్టకేలకు ఆ పార్టీకి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచిన రఘురామ కొద్ది కాలానికే పార్టీతో సత్సంబంధాలను కోల్పోయారు. అప్పటి నుంచి నేరుగానే సొంత పార్టీని విమర్శిస్తూ వస్తున్నారు. చివరకు ఇప్పుడు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్కు పంపించారు.
నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణం రాజు అంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన వారే. సొంత పార్టీ మీదనే విమర్శలు చేస్తుండటంతో ఆయనపై అందరి దృష్టీ పడింది. రెబల్ ఎంపీగా ఉంటూ పార్టీ విధానాల మీద, ప్రభుత్వ నిర్ణయాల మీద, సీఎం జగన్ రెడ్డి మీద ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే పార్టీకి మాత్రం రాజీనామా చేయలేదు. ఇప్పుడు కూడా పార్టీ అభ్యర్థిత్వానికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని ఎంపీగా కొనసాగుతున్నానని ఆయన చెప్పారు.
రఘురామ కృష్ణం రాజును ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం సీఐడీని రంగంలోకి దించి అరెస్టు చేయించింది. ఆయనపై దాడులూ జరిగాయి. ఆ తర్వాత కోర్టుకు నడవలేని పరిస్థితిలో వచ్చిన ఆయన… సీఎం జగన్ సీఐడీని అడ్డుపెట్టుకుని తనను హింసించారని కోర్టుకు తెలిపారు. కోర్టు బెయిల్ తో బయటపడ్డ ఆయన అప్పటి నుంచి మరింత రెచ్చిపోయారు. ప్రతీ రోజు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రభుత్వంపై, ముఖ్యంగా వైసీపీపై విరుచుకుపడుతుంటారు. దాడులకు భయపడో మరేకారణాలతోనో ఆయన దిల్లీకే పరిమితం అయ్యారు. ఈ పరిణామాల అనంతరం ఇప్పుడాయన పార్టీకి రాజీనామా చేశారు.