V Hanumanth who made sensational comments on Revanth Reddy
V Hanumanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు(V Hanumanth) సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తనను కలవడానికి నిరాకరిస్తున్నాడని, కానీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని వీహెచ్ ఆరోపించారు. సీఎం స్థాయిలో ఉన్న ఆయన కొంత మంది నాయకుల వద్దకు వెళ్లి.. తన స్థాయిని దిగజార్చుకుంటున్నారని అన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రశాంతంగా ఉందన్నారు. అయితే రేవంత్ రెడ్డితో చాలా విషయాలు మాట్లాడాలని అన్నారు.
రేవంత్‌తో చాలా విషయాలు మాట్లాడే అవసరం ఉందని కానీ ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. పార్టీలో చేరిన తక్కువ కాలంలోనే సీఎం అయింది రేవంత్ రెడ్డి ఒక్కరే. తెలంగాణలో రాదు అనుకున్న కాంగ్రెస్ పార్టీని గెలిపించింది కూడా ఆయనే అని అన్నారు. కానీ తాజాగా జరుగుతున్న పరిణామాలను చూసి కాంగ్రెస్ కార్యకర్తలు బాధపడుతున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ క్యాడర్‌కు న్యాయం చేయకుండా.. పార్టీలు మారి వస్తున్నవారికి రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ఆయన ఒక్కవైపే ఆలోచిస్తున్నారు, రెండు వైపుల ఆలోచించాలి అని, తాను రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదని అన్నారు. కానీ పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండలేను అని తన ఆవేదన వ్యక్తం చేశారు.