»Two Girlfriends Fight In Front Of Police For Boyfriend
Hyderabad : ప్రియుడు కోసం పోలీసుల ఎదుట ఇద్దరు ప్రియురాళ్ల వాగ్వాదం
పెండ్లి జరుగుతుండగానే పోలీసులు వచ్చి.. పెండ్లి ఆపండి! వరుడు కేడీ అని చెప్పి బేడీలు వేసే సన్నివేశాలు సినిమాల్లోనే చూస్తుంటాం. అలాంటి సన్నివేశమే నిజజీవితంలోనూ జరిగింది.
నేనంటే నేను అతన్ని పెళ్లి చేసుకుంటానని ప్రియురాళ్ల గొడవపడ్డారు. కడప జిల్లా రాయచోటి(Rayachoti)కి చెందిన బాబా ఫక్రుద్దీన్ అలియాస్ భాషా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన మాదాపూర్ శాఖలో ఓ యువతిని ప్రేమించి రహ్మత్‌నగర్ రూమ్‌లో సహజీవనం చేశాడు. సికింద్రాబాద్ (Secunderabad) శాఖలో ప్రేమించిన మరో యువతితో కార్ఖానాలోని రూమ్‌లో సహజీవనం చేశాడు. ఇటీవల అతని జాడ తెలియక పోలీసులను వారు ఆశ్రయించారు. బాషా కడప(Kadapa)లో మరో యువతితో నిశ్చితార్థం చేసుకుంటుండగా మధురానగర్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నివాసం ఉంటూ, బంజారాహిల్స్‌లోని ఓ చిల్డ్రన్స్ హాస్పిటల్ క్యాంటీన్లో వెయిటర్‌గా సదరు వ్యక్తి పనిచేస్తున్నాడు.
ఇతడు రహ్మత్‌నగర్(Rahmatnagar)లోని జవహర్‌నగర్‌కు చెందిన యువతి(23)ని ప్రేమ పేరుతో నమ్మించాడు. చెట్టాపట్టాలు వేసుకుని కలిసిమెలిసి తిరిగారు. ఆ యువతి అతడికి తన సర్వస్వాన్ని అప్పగించింది. ప్రేమికులిద్దరూ కలిసి కొన్నేండ్లు సహజీవనం చేశారు. మరో పెండ్లి కుదరటంతో ప్రియురాలి ఫోన్ నంబర్ బ్లాక్ చేశాడు. దీంతో బాధిత యువతి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కడప జిల్లా రాయచోటిలోని ఓ ఆర్టీసీ ఉద్యోగి కూతురితో నిశ్చితార్థం జరుగుతున్నదని తెలుసుకొన్న ఎస్సై ఇక్బాల్.. అక్కడికి చేరుకొని ఎంగేజ్మెంట్(Engagement)ను ఆపించారు. నిందితుడు వంచకుడంటూ వధువు తల్లిదండ్రులకు వివరించారు. దీంతో వాళ్లు తమ బిడ్డ జీవితాన్ని కాపాడారంటూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
పోలీసులు నిందితుడిని హైదరాబాద్‌కు తరలించగా, తనను కూడా ప్రేమ పేరుతో మోసం చేశాడని కార్ఖానాకు చెందిన ఓ దవాఖాన ఫార్మసీ ఇన్చార్జి (25) పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. అయితే, అక్కడ పోలీసులకు మరో షాకిచ్చారు ఆ యువతులు. కేసు పెట్టినందున తననే పెండ్లి చేసుకోవాలని జవహర్‌నగర్ (Jawaharnagar) యువతి పట్టుబట్టగా, మొదటగా ప్రేమించింది తానేనని మరో యువతి పోలీసులను వేడుకొన్నారు. ఒకరినొకరు వాగ్వాదానికి దిగారు. ఎవరిని పెండ్లి చేసుకోవాలో జైలుకు వెళ్లొచ్చాక చెప్తానంటూ నిందితుడు తెలిపాడు. అతడిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వీరిద్దరినే కాకుండా, ఎంత మంది యువతులను ప్రేమ పేరుతో మోసం చేశాడోనన్న కోణంలో విచారణ చేపట్టారు.