Kishan Reddy:తెలంగాణ పోలీసులకు స్వేచ్ఛను ఇవ్వాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అభిప్రాయపడ్డారు. పోలీసు వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ పోలీసులు చాలా ధైర్యవంతులు అని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని కోరారు. హైదరాబాద్‌లో ఉగ్ర మూలాలు బయటపడ్డ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) చేసిన కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
హైదరాబాద్‌లో నిర్మించిన కమాండ్ కంట్రోల్ రూమ్ ఏం చేస్తోందని కిషన్ రెడ్డి (Kishan Reddy) అడిగారు. తెలంగాణ ప్రభుత్వమే భూ ఆక్రమణలకు పాల్పడుతోందని చెప్పారు. రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేసి.. విలువైన భూములను బినామీ రియల్ ఎస్టేట్ కంపెనీలకు దోచి పెట్టిందని ఆరోపించారు. రైతు సమస్యల పరిష్కారం కావడం లేదన్నారు. ధరణి పోర్టల్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారని వివరించారు. లక్షల ఎకరాల భూమి ప్రొబేటరి ల్యాండ్‌గా ప్రకటించడంతో కోర్టుల చుట్టు తిరగాల్సి వస్తోందని అన్నారు. ధరణి పోర్టల్ వల్ల మధ్యవర్తులు, దళారీలను బీఆర్ఎస్ నేతలు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.