తెలంగాణలో సింగరేణి ఎన్నికల నగారా మోగింది. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికలు రెండేళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తున్నాయి. హైకోర్టు జోక్యంతో ఎట్టకేలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఓటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది.
సింగరేణి ఎన్నికల్లో మొత్తం 39,773 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సింగరేణి ఎన్నికల అధికారిగా శ్రీనివాసులు పర్యవేక్షణలో ఈ ఎన్నికలు సాగుతున్నాయి. పోలింగ్ కోసం ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం పరిధిలోని 11 డివిజన్లలో ఈ పోలింగ్ ను అధికారులు నిర్వహిస్తున్నారు.
ఈ ఎన్నికలకు సంబంధించి 84 పోలింగ్ కేంద్రాలు, 11 కౌంటింగ్ కేంద్రాలు, 168 బ్యాలెట్ బాక్సులను అధికారులు ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు బరిలోకి దిగుతున్నాయి. అందులో ప్రధానంగా సీపీఐ అనుబంధ సంస్థ అయిన ఏఐటీయూసీ, కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీయూసీ, బీఆర్ఎస్ అనుబంధ సంస్థ అయిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాల మధ్యే గట్టి పోటీ ఉండనుంది. సాయంత్రం 7 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. అలాగే అర్ధరాత్రికి ఫలితాలను అధికారులు ప్రకటించే అవకాశం ఉంది.