Revanth V/S KTR: స్కాంగ్రెస్ అని కేటీఆర్- కల్వకుంట్ల స్కామిలీ అంటూ రేవంత్ సెటైర్లు
అవినీతిపై మంత్రి కేటీఆర్- పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ పీక్‌కి చేరింది. టీ కాంగ్రెస్ ఫండింగ్ కోసం కర్ణాటక ప్రభుత్వం కష్టపడుతోందని కేటీఆర్ అనగా.. కల్వకుంట్ల స్కామిలీ అంటూ రేవంత్ మొదలెట్టారు.
Revanth V/S KTR: తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ గట్టిగానే జరుగుతోంది. మంత్రి కేటీఆర్ (ktr) కామెంట్లకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కోసం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కష్టపడుతోందని కేటీఆర్ (ktr) అనగా.. రేవంత్ రెడ్డి కల్వకుంట్ల స్కామిలీ అంటూ విరుచుకుపడ్డారు.
బెంగళూరులో బిల్డర్ల నుంచి చదరపు అడుగుకు రూ.500 చొప్పున ప్రభుత్వం వసూల్ చేస్తోందని మంత్రి కేటీఆర్ (ktr) ఆరోపించారు. స్కామ్‌లకు కాంగ్రెస్ పెట్టింది పేరు అని.. కాంగ్రెస్‌ను స్కాంగ్రెస్ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేటీఆర్ కామెంట్లకు రేవంత్ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.
అవినీతిలో మునిగిపోయి.. నిద్రలో కూడా కమీషన్ల గురించి కలవరించే మీరా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేది అని రేవంత్ విరుచుకుపడ్డారు. పొరుగు రాష్ట్రంపై గాలి మాటలు పక్కన పెట్టి.. తెలంగాణలో కల్వకుంట్ల స్కామిలీ గురించి చెప్పండి అంటూ స్టార్ట్ చేశారు. దళితబంధులో 30 శాతం కమీషన్లు వసూల్ చేస్తున్నారని మీ నాన్నే ఒప్పుకున్నారని గుర్తుచేశారు. లిక్కర్ స్కామ్‌లో మీ చెల్లి రూ.300 కోట్లు వెనకేసుకుందని దేశమంతా చెప్పుకుంటుంది. భూములు, మద్యం అమ్మితే తప్ప తెలంగాణలో పాలన నడవడం లేదని కాగ్ కడిగిపారేసింది.
రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ భూములు అమ్ముకున్నారో.. ఎన్ని ఎకరాలను రియల్ మాపియాకు కట్టబెట్టారో.. ఎంతమంది బినామీ బిల్డర్లతో హైదరాబాద్ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారో.. లక్షల చదరపు అడగుల స్థలాలు మాఫియా కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయో లెక్కలతో సహా తేలుస్తాం అన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవడం మీ వల్ల కాదని స్పష్టంచేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలను చూసి తండ్రికి చలిజ్వరం వస్తే.. కొడుక్కు పూర్తిగా మతి తప్పినట్టు ఉందని రేవంత్ సెటైర్లు వేశారు.