Komatireddy Venkat Reddy Made Sensational Comments
Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్ పార్టీ ఓ లూట్ అని, కేసీఆర్ సర్కార్ లూట్ అని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం పడకేసిందని ధ్వజమెత్తారు. కార్పొరేట్లను భారీగా దోచుకుంటున్నారని ఆరోపించారు. అందుకే ఆ పార్టీ ఖాతాలో రూ.900 కోట్ల నిధులు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు.
ఆ నిధులు ఎక్కడివీ.. ఎవరెవరు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని కోమటిరెడ్డి (komatireddy) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పదేళ్లలో మంత్రి కేటీఆర్ అక్రమంగా బాగానే సంపాదించారని ఆరోపించారు. కేటీఆర్ బినామీల ఖాతాల్లో రూ.90 వేల కోట్లు జమ అయ్యాయని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దానికి ఔటర్ రింగ్ రోడ్ ఒక ఉదహరణ అని తెలిపారు. అవినీతి పరులను వదిలి పెట్టబోమని కోమటిరెడ్డి స్పష్టంచేశారు.
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలవడం ఖాయం అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత అవినీతి పరులను జైలుకు పంపిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది బినామీలు అందరూ జైలులో ఉంటారని కుండబద్దలు కొట్టారు. 2 నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ తమ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఓకేసారి మొత్తం అభ్యర్థుల లిస్ట్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ రెండు పార్టీల తర్వాత.. చివరికీ బీజేపీ జాబితా విడుదల అవనుంది.