కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు.
Medigadda Barrage: తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీ వంతెన కుంగిపోయిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లక్ష్మీ బ్యారేజీని పరిశీలించారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్‌లో రాహుల్ మేడిగడ్డ చేరుకుని అంబటిపల్లిలో మహిళా సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సు తర్వాత బ్యారేజీని పరిశీలించడానికి వెళ్లారు. రాహుల్‌తో పాటు ఆరుగురికి మాత్రమే బ్యారేజీని పరిశీలించేందుకు అనుమతి ఇచ్చారు. ప్రాజెక్ట్ స్థలంలో సెక్షన్ 144 అమల్లో ఉండటంతో పరిమిత సంఖ్యలోనే సందర్శకులకు అనుమతి ఇచ్చారు. కానీ మేడిగడ్డ వైపుకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. సెక్షన్ 144 అమలు ఉండటంతో పోలీసులు కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ సర్కారుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.
లక్ష కోట్లతో నిర్మించిన బ్యారేజీ రెండేళ్లలోనే కుంగిపోవడం దురదృష్టకరమమని, ప్రాజెక్టు కోసం విడుదల చేసిన డబ్బును సగానికి దోచుకోవడం వల్లే నాణ్యత లేకుండా ప్రాజెక్టు కట్టారని రాహుల్ ఆరోపించారు. మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులు నాసిరకంగా నిర్మించారని, నిధులు పూర్తి స్థాయిలో ఖర్చు చేయకుండా దోపిడీ చేశారని ఆరోపించారు. దర్యాప్తు సంస్థలకు అధిపతులుగా ఉన్న అమిత్‌షా, మోదీ అవినీతిపై చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇలా ఎన్నేళ్లు ప్రాజెక్టులకు రిపేర్లు చేస్తారన్నారు. ఈ బ్యారేజీని రాహుల్ పరిశీలించినప్పుడు అతనితో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు తదితరులు ఉన్నారు.