Uttam Kumar Reddy : ప్రధాని నరేంద్రమోడీ శనివారం తెలంగాణలో పర్యటించారు. ఆయన పర్యటనలో భాగంగా రాష్ట్రానికి ఎలాంటి ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రధాని ప్రకటించకపోవడంతో కాంగ్రెస్ ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ప్రారంభించిన చాలా ప్రాజెక్టులు సంవత్సరాల క్రితమే ప్రకటించబడ్డాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ ఇంత ఆలస్యంగా ప్రారంభించి.. మోడీ వాటిని కొత్త కార్యక్రమాలుగా భావించారన్నారు. నాలుగేళ్ల క్రితం ఆమోదించిన ఎయిమ్స్ బీబీనగర్ ప్రాజెక్ట్, మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తీవ్ర ఆలస్యమైందన్నారు. ఆలస్యానికి క్షమాపణలు చెప్పే బదులు, పూర్తి చేయడానికి గడువు ఇవ్వకుండానే ప్రధాని మోదీ వేడుకగా మళ్లీ శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు.
బీబీనగర్ ఎయిమ్స్‌కు కేంద్ర మంత్రివర్గం డిసెంబర్ 17,2018న ఆమోదం తెలిపిందని, ప్రాజెక్టుకు రూ. 1,028 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు కేవలం రూ. 31.71 కోట్లు విడుదలయ్యాయి. ప్రాజెక్ట్ పూర్తి గడువు సెప్టెంబర్ 2022 అయినా, ఇటీవల జనవరి 2025 వరకు పొడిగించబడింది. ప్రస్తుత గడువుపై కూడా ఇంకా కేంద్రం మౌనంగా ఉందని ఉత్తమ్ అన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణంలో జాప్యం నవంబర్ 2019- డిసెంబర్ 2021 మధ్య చాలాసార్లు పెరిగింది. కేంద్రం కేటాయించిన నిధులలో కొద్ది భాగాన్ని మాత్రమే ప్రాజెక్టుకు ఖర్చు చేసినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ఇంకా, బీబీనగర్ ఎయిమ్స్ లో మంజూరైన ఖాళీలను భర్తీ చేయడానికి బిజెపి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. ఇంకా.. అనేక అధ్యాపకులు, అధ్యాపకేతర పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉత్తమ్ పేర్కొన్నారు. తెలంగాణపై బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వివక్ష చూపుతోందని కాంగ్రెస్ ఎంపీ ఆరోపించారు. ప్రధానమంత్రి మోదీ బీబీనగర్ ఎయిమ్స్‌కు నిర్మాణం కు ఇటీవల రూ. 1,366 కోట్లు కేటాయించారు. కానీ ప్రాజెక్టు జాప్యంపై వివరణ ఇవ్వలేదు. ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ప్లాంట్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో తెలంగాణకు ఇచ్చిన ఇతర హామీలను ఆయన ప్రస్తావించలేదన్నారు.