Mangoes On EMI: ఇప్పటి వరకు మనం ఎలక్ర్టానిక్ వస్తువులు నెలవారీ ఈఎంఐలో తీసుకుని ఉంటాం. మహారాష్ట్రలో ఓ వ్యాపారి వినూత్నంగా మామిడి పండ్లు కూడా ఈఎంఐలో అమ్ముతానని ప్రకటించాడు. వేసవి అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది మామిడి పండ్లు. ప్రతీ ఒక్కరు మామిడి పండ్లను తినాలని చూస్తుంటారు. ఎందుకంటూ మామిడికున్న క్రేజ్ అలాంటిది పైగా అది ‘పండ్లలో రాజు’ . మామిడిలో చాలా రకాలున్నాయి. కొన్ని రకాలు వరల్డ్ ఫేమస్. ఆ కేటగిరిలోదే ఆల్పోన్సో మామిడి రకం. మహారాష్ట్రలోని సింధ్ దుర్గ్ జిల్లా దేవ్ ఘర్, రత్నగిరి జిల్లాలో దొరకే ఆల్ఫాన్సో రకం మామిడి పండ్లను అమ్మేందుకు పూణేకు చెందిన గురు కృప ట్రేడర్స్ యజమాని గౌరవ్ సనాస్ వినూత్న ఆలోచన చేశారు.
మాములుగా ఆల్పోన్సో మామిడి ధర చాలా ఎక్కువ. కేవలం ఒక డజన్ మామిడి పండ్లకే రూ.500-1300 మధ్య ఉంటుంది. మామిడి ప్రియులు ధర చూసి కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు. అలాంటి వారి కోసమే పూణే వ్యాపారి ఈఎంఐ పద్దతిని తీసుకువచ్చారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా గత 2-3 ఏళ్లలో మార్కెట్లు కుప్పకూలాయి. గౌరవ్ సనాస్ తమ దుకాణంలో దొరికే మామిడి పండ్లను క్రెడిట్ కార్డు ద్వారా ఈఎంఐ పద్దతిలో కొనుగోలు చేయవచ్చని ప్రకటించారు. రూ. 5000 అంత కన్నా ఎక్కువ విలువ చేసే పండ్లు కొనుగోలు చేస్తే మాత్రమే ఈ సదుపాయం ఉందని గౌరవ్ వెల్లడించారు. ఈఎంఐ పద్దతిలో మూడు, ఆరు, 12 నెలల వారీగా వాయిదాల్లో చెల్లించే వెసులుబాటును కల్పించారు.