వైసీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి పేర్ని నానిపై టీడీపీ సీనియర్ నేత కొల్లు రవీంద్ర ఫైరయ్యారు. మచిలీపట్నంలో ప్రభుత్వ భూమి వైసీపీ కార్యాలయానికి కేటాయింపుపై రవీంద్ర నిన్న ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఆయన మీడియా ముందుకు వచ్చారు. పార్టీ ఆఫీసు పేరుతో 5.40 ఎకరాల ప్రభుత్వ భూమి దోపిడీ చేసే కుట్ర జరుగుతుందని రవీంద్ర ఆరోపించారు. రూ.300 కోట్ల విలువ గల భూమిని కబ్జా చేసేందుకు నాని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ప్రజల ఆస్తిని పార్టీ ఆఫీసుకు ఎలా కేటాయిస్తారు అని అడుగుతున్నారు. అది పేర్ని నాని కష్టమా? లేదంటే ఆయన తండ్రి కష్టమో? చెప్పాలని డిమాండ్ చేశారు.
కొందరు అధికారులు కలిసి భూ రికార్డులు మార్చారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. వారు తగిన మూల్యం చెల్లించుక తప్పదని హెచ్చరించారు. సదరు అధికారులు విధుల నుంచి రిటైర్ అయినా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజల ఆస్తుల రక్షణ కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. ఆ భూమి ఏపీ పోలీసుల క్వార్టర్స్‌కు చెందినది, మాస్టర్ ప్లాన్‌లో అలానే ఉందన్నారు. మరి పోలీసులు ఎందుకు స్పందించడం లేదని అడిగారు. భూములు వెళుతున్నా కాపాడుకోలేని పరిస్థితిలో పోలీసులు ఉన్నారా? అని ప్రశ్నించారు.
అధికార పార్టీకి చెందిన నేతలు భూమిని కొట్టేస్తుంటే.. పోలీసులు ఏం చేస్తున్నారని అడిగారు. పోలీసుల ఆస్తి కోసం తాము పోరాటం చేస్తున్నామని తెలిపారు. తిరిగి తమపై కేసు పెడతారా అని ప్రశ్నించారు. మచిలీపట్నం వైసీపీ పార్టీ ఆఫీసు అంశంపై డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళతామని చెప్పారు.