RR: స్థానిక సంస్థల ఎన్నికల్లో గిరిజనులు గెలుపొందడం పట్ల సేవాలాల్ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. షాద్‌నగర్ పట్టణంలోని సేవాలాల్ కమిటీ సభ్యులు 6వ వార్డు కౌన్సిలర్ రాజునాయక్, దేవుని బండ తండా సర్పంచ్ శ్రీను నాయక్‌ను కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి నచ్చే విధంగా పాలన అందిస్తామన్నారు.
MDK: తూప్రాన్ మండలం యావపూర్‌లో చేపడుతున్న స్వచ్చ భారత్ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ స్వచ్ఛ భారత్ పురస్కరించుకుని సర్పంచ్ యంజాల స్వామి పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామంలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తొలగింపజేశారు. అనంతరం వీధులను శుభ్రం చేశారు. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో గ్రామ యువత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆధ్వర్యంలో జరుగుతున్న పత్తి కొనుగోళ్ల గడువును ఫిబ్రవరి 27 వరకు పొడిగించినట్లు ఆయా జిల్లాల మార్కెట్ ఉన్నత శ్రేణి అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ వద్ద ఉన్న పత్తిని మద్దతు ధరకు అమ్ముకోవాలని సూచించారు.
గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కుటుంబసభ్యులు శనివారం రాత్రి మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠాన్ని సందర్శించారు. ఆయన ధర్మపత్ని బండ్ల జ్యోతి, తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి సహా పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులను దర్శించి ఆశీస్సులు పొందారు. మార్చి 14న జరిగే వివాహ మహోత్సవానికి ఆహ్వాన పత్రికను అందజేశారు.
BHPL: చిట్యాల మండలం వెంకట్రావుపల్లి (C) గ్రామంలోని హనుమాన్ ఆలయంలో శ్రీరామదాసు భక్తమండలి చేల్పూర్ ఆధ్వర్యంలో భద్రాద్రి సీతారాముల కళ్యాణం కోసం గోటితో వడ్ల వలవడం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సర్పంచ్ తౌటం లక్ష్మి, ఉపసర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్ పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వయంగా గోటితో వడ్లు వలిచి తలంబ్రాలు సిద్ధం చేశారు.
NLG: ఆమనగల్లులోని శ్రీ పార్వతి రామలింగేశ్వర దేవాలయ భూమి బహిరంగ కౌలు వేలం రేపు ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. ఈ మేరకు దేవాలయ ఇన్‌ఛార్జ్ మేనేజర్ మృత్యుంజయ శాస్త్రి, ఛైర్మన్ విద్యాసాగర్ తెలిపారు. వేలంలో పాల్గొనే వారు ముందుగా రూ.5 వేలు డిపాజిట్ చేయాలని సూచించారు. దేవాలయ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలని నిర్వాహకులు కోరారు.
MNCL: వేమనపల్లి మండలం నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న 4 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. CEIR పోర్టల్ ద్వారా బద్దంపల్లి, చామనపల్లి, లక్ష్మీపూర్, మొట్లగూడ గ్రామాలకు చెందిన వారి ఫోన్లను గుర్తించారు. SI జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కానిస్టేబుల్ భరత్ సహకారంతో వీటిని యజమానులకు అప్పగించారు.
PDPL: తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడంతో పెద్దపల్లి ఉద్యమకారుల ఫోరం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రెస్‌క్లబ్‌లో సమావేశమైన నాయకులు, ప్రజాప్రభుత్వం ఉద్యమకారుల సంక్షేమానికి కట్టుబడి ఉండటం సంతోషకరమని తెలిపారు. ఫోరం కన్వీనర్ ఐలయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
SRCL : తంగళ్ళపల్లి మండలం సారంపల్లిలో సర్పంచ్ గుగ్గిళ్ళ లావణ్య ఆధ్వర్యంలో ఆదివారం చిన్నారులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పిల్లలకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భరత్ గౌడ్, మునిగేలా రాజు, వార్డ్ సభ్యులు ఖాదర్, భారతవ్వ, హనీఫ్, గంగారాం తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ చొరవను గ్రామస్తులు అభినందించారు.
NLG: ‘సీఎం-కప్’ రాష్ట్రస్థాయి క్రీడల్లో ఆమనగల్లు గ్రామానికి చెందిన నలబాల లిఖిత 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించి రికార్డు సృష్టించింది. 33 జిల్లాల నుంచి పాల్గొన్న పోటీదారులలో మూడవ స్థానంలో నిలిచి తన ప్రతిభను చాటింది. గ్రామీణ క్రీడాకారులకు ‘సీఎం-కప్’ గొప్ప వేదికని, తన తదుపరి లక్ష్యం జాతీయ స్థాయికి ఎంపిక కావడమేనని లిఖిత పేర్కొంది.
MDCL: అల్వాల్ TIMS ఆసుపత్రి నిర్మాణంలో వేగం పెరిగినట్లుగా అక్కడి ఇంజనీర్లు తెలిపారు. ఈ ఏడాదిలోనే TIMS ఆసుపత్రి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే చివరి దశలో వర్క్ కొనసాగుతుండగా, ఇది అందుబాటులోకి వస్తే పరిసర ప్రాంతాల వారికి ప్రభుత్వ వైద్యం మరింత చేరువవుతుందని స్థానిక డాక్టర్ శివప్రకాష్ వర్మ తెలిపారు.
MDK: రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో ఆదివారం గ్రామపంచాయతీ వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎఫ్ఆర్‌వో కుద్బుద్దిన్ మాట్లాడుతూ.. అడవుల పరిరక్షణకై ప్రతి ఒక్కరు సహకరించాలని, అడవిలో అగ్ని ప్రమాదాలు జరిగితే వెంటనే సమాచారం అందించాలని గ్రామస్తులకు సూచించారు.
RR: బాన్సువాడ హింసలో గాయపడిన బాదిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళుతున్న BJP రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావును అడ్డుకుని నిర్బంధించడం ప్రభుత్వ దౌర్జన్యానికి పరాకాష్ట అని SDNR BJP నేత శ్రీవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. అసలు దుండగులను వదిలిపెట్టి బాధితుల పక్షాన నిలిచిన నాయకుడిని అరెస్టు చేయడం అధికార దుర్వినియోగానికి ఉదాహరణ అన్నారు.
PDPL: రామగుండం కార్పొరేషన్ డివిజన్లలో కనీస సౌకర్యాలు కల్పించి, అభివృద్ధి కార్యక్రమాలను పటిష్టంగా చేపట్టాలని CPI నాయకులు కనకరాజు, కార్పొరేటర్ మార్కాపురి సూర్య మేయర్ మహంకాళి స్వామిని ఆదివారం కలిసారు. మార్కండేయ కాలనీలో సమస్యలపై చర్చించి, పనులను తక్షణమే అమలు చేయమని కోరారు. గోశిక మోహన్, గౌతం గోవర్ధన్, తాళ్లపల్లి మల్లయ్య, శంకర్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
WNP: పట్టణంలోని 14వ వార్డు అధ్వాన్నంగా తయారైంది. స్థానిక బ్రహ్మంగారి ఆలయం వెనుక భాగం ప్రస్తుతం చెత్తాచెదారంతో నిండి, ఒక మినీ డంపింగ్ యార్డ్‌ను తలపిస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో హడావుడి చేసిన అధికారులు, ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో వార్డు ప్రజలు మండిపడుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.