KNR: కేంద్ర మంత్రి బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర మండుటెండలోనూ ఉత్సాహంగా సాగుతోంది. గంగాధర మండలం సమీపంలో యాత్ర కొనసాగుతుండగా, వైద్య బృందం ఆయనకు రొటీన్ హెల్త్ చెకప్ నిర్వహించింది. ఎండ తీవ్రత దృష్ట్యా మంత్రి ఆరోగ్యాన్ని పరీక్షించిన వైద్యులు, తగు సూచనలు చేశారు. కొద్దిసేపు విశ్రాంతి అనంతరం ఆయన తిరిగి పాదయాత్రను ప్రారంభించారు.
NZB: ఉపాధ్యా యులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ TPUS ఉపాధ్యాయ సంఘం నేతలు ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి శనివారం వినతి పత్రం అందజేశారు. నూతన PRC అమలు, పెండింగ్‌లో ఉన్న DAల విడుదల, పెన్షన్ సౌకర్యాలు వంటి అంశాలను అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని MLA హామీ ఇచ్చారు.
PDPL: పెద్దపల్లి జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మెడికల్ కోడింగ్&బిల్లింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ఈ శిక్షణ మార్చి 16 నుంచి పెద్దపల్లి TASK రీజినల్ సెంటర్‌లో ప్రారంభంకానుందని, ఫార్మసీ, బయోటెక్నాలజీ విద్యార్థులు నమోదు చేసుకోవాలన్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
KMM: జిల్లాలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తును శనివారం ADCP ప్రసాదరావు పరిశీలించారు. నగరంలోని శాంతినగర్ ప్రభుత్వ పాఠశాల, మోంట్ ఫోర్ట్ స్కూల్, రాజేంద్రనగర్, నయాబజార్ పరీక్ష కేంద్రాలను ఆయన సందర్శించారు. కమిషనరేట్ పరిధిలోని 98 కేంద్రాల్లో పరీక్షలు సజావుగా సాగేలా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
BHPL పట్టణంలోని కృష్ణ కాలనీకి చెందిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) జిల్లా నాయకులు అంబాల నరసయ్య అనారోగ్యంతో బాధపడుతుండగా ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న TRP జిల్లా అధ్యక్షుడు రవిపటేల్ శనివారం వారి నివాసానికి వెళ్లి ఆయన పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ADB: నార్నూర్ మండల కేంద్రంలో శనివారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటించారు. ఈ సందర్బంగా మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ కావేరితో పలు సమస్యలపై చర్చించారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాన్సన్ నాయక్, శ్రీరామ్ నాయక్, ఉత్తమ్ రాథోడ్, బానోత్ గజానంద్, దాదేఅలీ, తిరుమల గౌడ్, సయ్యద్ కాసిం, కొర్రల మహేందర్ పాల్గొన్నారు.
ASF: ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ ఐపీఎస్ పట్టణంలోని పదో తరగతి పరీక్షా కేంద్రాలను శనివారం తనిఖీ చేశారు. పరీక్షలు పారదర్శకంగా జరిగేలా కేంద్రాల వద్ద 163 BNSS (సెక్షన్ 144) అమలులో ఉందని, పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఆయన సూచించారు.
GDWL: జిల్లా కేంద్రంలో శనివారం వేడుకల కోలాహలం నెలకొంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి, ఐశ్వర్య రెడ్డిల వివాహ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్య మంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
WGL: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఖిలా వరంగల్ మండలంలో శనివారం మధ్యాహ్నం జరిగింది. మామునూరు పోలీస్ స్టేషన్ ఎదుట బొలెరో వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
SDPT: దుబ్బాక 100 పడకల ఆసుపత్రిలో రూ. 25 లక్షల విలువైన గైనకాలజీ ల్యాప్రోస్కోపిక్ పరికరాలను మెదక్ ఎంపీ రఘునందన్ రావు శనివారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత మహిళలకు అత్యాధునిక వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ సదుపాయం కల్పించినట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు స్థానిక మహిళలు శస్త్రచికిత్సల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ ఆసుపత్రిలోనే మెరుగైన సేవలు ఉన్నాయన్నారు.
KMR: భిక్కనూర్ పట్టణ కేంద్రంలో హోటళ్లు, స్వీట్ హోంలలో అక్రమంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల వినియోగం పై సివిల్ సప్లై అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా వాడుతున్న స్వీట్ హోం, టిఫీన్ సెంటర్ల నుంచి 5 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు సివిల్ సప్లై అధికారి కిష్టయ్య తెలిపారు.
MHBD: మరిపెడ పట్టణ సమగ్రాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మున్సిపల్ ఛైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి తెలిపారు. ఇవాళ ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 12,10వ వార్డులలో వార్డు సభ్యులు, అధికారులతో కలసి ఆమె పర్యటించి, పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. కొనసాగుతున్న అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలన్ని సంబంధిత అధికారులకు సూచించారు.
JN: చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇవాళ స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. వేద మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కల్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మెన్ శ్రీధర్ రావు, పాలకమండలి, ఈఓ లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
MDCL: కూకట్‌పల్లి ప్రగతినగర్‌లో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి ఈశ్వరరావు, సంతోష్ కుమార్‌తో సహా మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.59,310 నగదు, 6 సెట్ల పేకాట కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
NLG: ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ 7వ వార్డు కౌన్సిలర్ దేశపాక లత రాజేష్ ఆదర్శంగా నిలిచారు. తన వార్డులో ఆడపిల్లల వివాహానికి రూ.15,116 పెళ్లి కానుకగా ఇస్తానన్న మాట ప్రకారం, ఇవాళ బొల్గూరి యాదయ్య కుమార్తె వివాహానికి ఆ మొత్తాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పోకల దేవదాసు, శామ్యూల్, అశోక్, ఏసురత్నం తదితరులు పాల్గొని కౌన్సిలర్‌ను అభినందించారు.